
బర్మింగ్‌హామ్: ప్రతిష్మాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత వెయిట్ లిఫ్టర్ గురురాజ పుజారి బ్రాంజ్ మెడల్ సాధించాడు. శనివారం జరిగిన పురుషుల 61 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గురురాజ 269 కేజీల బరువెత్తి మూడో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 118 కేజీల బరువు ఎత్తిన గురురాజ.. క్లీన్ అండ్ జెర్క్‌లో 153 కేజీలు ఎత్తాడు.
మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిడిన్ మహ్మద్ 285 కేజీలు ఎత్తి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. స్నాచ్‌లో 121, క్లీన్ జర్క్‌లో 153 కేజీల బరువెత్తాడు. పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 273 కేజీలు (121, 152) ఎత్తి రజతం సాధించాడు. కాగా, గురురాజకు కామన్‌వెల్త్ క్రీడల్లో ఇది వరుసగా రెండో పతకం కావడం విశేషం. అతను 2018 గోల్డ్ కోస్ట్ క్రీడల్లో 56 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు.
అంతకుముందు వెయిట్ లిఫ్టింగ్‌కే చెందిన సంకేత్ సర్గార్ రజత పతకం సాధించి భారత్‌కు తొలి మెడల్ అందించాడు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగం ఫైనల్లో 248 కేజీల బరువు ఎత్తిన సంకేత్ సర్గార్ తృటిలో స్వర్ణపతకాన్ని చేజార్చుకున్నాడు. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి ప్రయత్నంలోనే 135 కేజీల బరువెత్తిన మహదేవ్.. రెండు, మూడో ప్రయత్నంలో 139 కేజీల బరువు ఎత్తలేకపోయాడు. రెండో ప్రయత్నంలోని గాయపడ్డ అతను.. మూడోసారి ప్రయత్నించడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అతని కుడి మోచేతి సహకరించలేదు. స్నాచ్ విభాగంలో మూడో ప్రయత్నంలో 113 కేజీల బరువు ఎత్తి టాప్‌లో నిలిచినప్పటికీ.. మలేషియా వెయిట్ లిఫ్టర్ అనిఖ్ కస్దాన్ మహదేవ్‌ను అధిగమించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు.
క్లీన్ అండ్ జర్క్ విభాగంలో చివరి ప్రయత్నంలో 142 కేజీల బరువుత్తి రికార్డు సృష్టించిన అనిఖ్.. స్నాచ్ విభాగంలో 107 కేజీలే ఎత్తాడు. ఓవరాల్‌గా 249 కేజీలు ఎత్తి టాప్‌లో నిలిచాడు. శ్రీలంకకు చెందిన దిలంక ఇసురు 225 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. స్నాచ్ విభాగంలో 105 కేజీలు ఎత్తిన శ్రీలంక ప్లేయర్.. క్లీన్ అండర్ జర్క్‌లో 120 కేజీలు ఎత్తాడు.
భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టాడు. పురుషుల స్విమ్మింగ్ 100 మీ బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో తొలిసారి ఫైనల్లో ప్రవేశించాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్ సెమీఫైనల్ హాట్-2లో రేసును 54.55 సెకన్లలో పూర్తి చేసిన నటరాజ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఏడో ప్లేయర్‌గా ఫైనల్లో అడుగుపెట్టిన నటరాజ్ పతకంపై ఆశలు పెంచాడు. ఇక ఫైనల్ రేసు ఆదివారం జరగనుంది.
బ్యాడ్మింటన్‌లో ఇప్పటికే పాక్‌ను చిత్తు చేసి ఊపు మీదున్న భారత్ గ్రూప్-ఏలో లంకపైనా ఆధిక్యం కొనసాగిస్తోంది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ 3-0 లీడ్‌లోఉంది. ఇక పురుషుల మారథాన్ ఫైనల్‌లో భారత్ అథ్లెట్ రావత్ 17 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.