
న్యూఢిల్లీ: కరోనా సెగ క్రీడలతో పాటు జాతీయ క్రీడా పురస్కారాలకు కూడా తాకింది. ప్రతీ ఏడాది ఏప్రిల్‌లోనే మొదలయ్యే జాతీయ వార్షిక క్రీడా పురస్కారాల ప్రక్రియ ఈ సంవత్సరం ఆలస్యం కానుంది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగనుండటమే దీనికి ప్రధాన కారణం.
సాధారణంగా కేంద్ర క్రీడా శాఖ ప్రతీ ఏడాది ఏప్రిల్‌లో దరఖాస్తులు ప్రక్రియ పూర్తి చేస్తుంది. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అవార్డులను అందజేస్తుంది. కానీ కరోనా కారణంగా అన్నింటితో పాటు స్పోర్ట్స్ ఫెడరేషన్‌లు మూతపడ్డాయి. దీంతో అప్లికేషన్ ప్రక్రియ కూడా వాయిదా పడింది.
'లాక్‌డౌన్‌తో జాతీయ క్రీడా సమాఖ్యలతోపాటు క్రీడా మంత్రిత్వ శాఖలోని పలు కార్యాలయాల్లో ఇంటినుంచే పని జరుగుతోంది. దాంతో క్రీడా పురస్కారాల ప్రక్రియలో జాప్యం అనివార్యం కానుంది. వచ్చే నెలలో అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించే అవకాశముంది' అని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి.
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ పురస్కారాలు నేషనల్ స్పోర్ట్స్ అవార్డుల కిందకు వస్తాయి. ఆయా క్రీడా రంగాల నుంచి ఆటగాళ్లను పెట్టుకున్న దరఖాస్తులను కేంద్ర క్రీడా శాఖ నియమించిన కమిటీ పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో దిగ్గజ క్రీడాకారులు, మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టులు ఉంటారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 27వేలకు చేరగా.. 826 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడగా.. 20,700 మంది ప్రాణాలు కోల్పోయారు.