భారత క్రీడా బృందానికి ఊహించని షాక్ తగిలింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 నుంచి హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, స్క్వాష్, షూటింగ్, నెట్‌బాల్, రోడ్ రేసింగ్‌ను తొలగిస్తున్నట్లు కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ప్రకటిచింది.
రెండేళ్ల క్రితం బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఈ క్రీడలన్నీ ఉన్నాయి. మొత్తం 19 క్రీడాంశాల్లో అథ్లెట్లు పోటీపడ్డారు. అయితే ఈ సారి ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో 9 క్రీడాంశాలను తొలగించాలని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య నిర్ణయించింది. దాంతో ఈ సారి 10 క్రీడాంశాల్లోనూ కామన్వల్త్ పోటీలు జరగనున్నాయి.

కామన్వెల్త్ దేశాల మధ్య ఒలింపిక్స్ తరహాలో ప్రతీ నాలుగేళ్లకోసారి జరిగే కామన్వెల్త్ క్రీడల ఈ సారి స్కాంట్లాండ్‌లో గ్లాస్గో వేదికగా జరగనున్నాయి. వచ్చే ఏడాది జూలై 23 నుంచి ఆగస్ట్ 2 వరకు ఈ టోర్నీ జరగనుంది.
ఈ నిర్ణయం భారత్‌కు ఊహించని షాకిచ్చింది. ఎందుకంటే భారత్‌కు పతకాలు సాధించే క్రీడలే హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, క్రికెట్, షూటింగ్.ఇప్పుడు ఆ క్రీడాంశాలను తొలగించడంతో భారత పతకాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మొత్తం 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 స్వర్ణాలతో పాటు 16 రజతాలు, 23 కాంస్యాలున్నాయి.
రెజ్లింగ్‌లో అత్యధికంగా 12 పతకాలు రాగా.. వెయిట్ లిఫ్టింగ్‌లో 10 మెడల్స్ వచ్చాయి. వాస్తవానికి కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జరగాల్సింది. కానీ ఖర్చులు పెరగడంతో విక్టోరియా ఆతిథ్య హక్కులను వదులుకుంది. తమకు విద్య, వైద్యమే ముఖ్యమని, క్రీడల కోసం ఇంత ఖర్చు చేయలేమని స్పష్టం చేసింది. దాంతో టోర్నీ నిర్వహణకు స్కాట్లాండ్ ముందుకొచ్చింది. ఖర్చు తగ్గించుకునేందుకు 9 క్రీడాంశాలను తీసేసింది.