
లండన్: ఎలాంటి బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో ఆడాలని కామన్వెల్త్ గేమ్స్ 2022 బరిలోకి దిగే భారత ఆటగాళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ గేమ్స్‌కు భారత ఒలింపిక్స్ సంఘం 322 మంది సభ్యులతో కూడిన జంబో టీమ్‌ను ఎంపిక చేసింది. ఈ బృందంలో 215 మంది అథ్లెట్లు 107 మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. 215 మంది అథ్లెట్లు 19 క్రీడా విభాగాలతో పాటు 141 ఈవెంట్స్‌లో భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు.
ఇక ఈ టోర్నీలో పాల్గొనే భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. తన మాటలతో వారిలో స్పూర్తిని నింపే ప్రయత్నం చేశారు. భారతదేశంలో క్రీడల కొత్త శకం మొదలైందన్న మోదీ.. విజయాలతో రాగానే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుందామని హామీ ఇచ్చారు. నయా భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. భారతదేశంలోని మూల.. మూలన క్రీడా ప్రతిభతో నిండి ఉందని నిరూపించాలని కోరారు.'ఒత్తిడి లేకుండా మీ బలాన్ని నమ్మి బాగా ఆడండి. ఎలాంటి బెదురు, బెరుకు లేకుండా ఆడండి. తికమకపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి'అథ్లెట్లకు సూచించాడు.
కామన్వెల్త్ గేమ్స్‌లో ఈసారి క్రీడల్లో షూటింగ్ లేకపోవడం భారత అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. కానీ కొత్తగా వేరే ఆటలు కామన్వెల్త్‌లో భాగం కాబోతున్నాయి. అందులో బాస్కెట్‌బాల్ 3×3, వీల్ ఛైర్ బాస్కెట్‌బాల్, పారా టేబుల్ టెన్నిస్‌లతో పాటు మహిళల క్రికెట్ కూడా ఉండడం విశేషం. గతంలో కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల క్రికెట్ పోటీలు జరిగాయి కానీ.. మహిళల క్రికెట్ ఇందులో భాగం కావడం ఇదే తొలిసారి.
టోర్నీకి ఎనిమిది జట్లు ఎంపిక కాగా.. భారత మహిళల జట్టు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్‌లతో కలిసి గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్-బిలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఉన్నాయి. రెండు గ్రూప్‌ల్లో రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌ల తర్వాత రెండేసి జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఇటీవలే శ్రీలంక పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు నెగ్గి జోరు మీదున్న హర్మన్‌ప్రీత్ సేన.. ఇదే జోరు కొనసాగిస్తే కామన్వెల్త్ క్రికెట్లో పతకం గెలవడం కష్టమేమీ కాదు. పసిడి రేసులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురు కావచ్చు. 29న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆగస్టు 7న ఫైనల్ జరుగుతుంది.