
చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌కు రంగం సిద్దమైంది. తమిళనాడులోని మహాబలిపురం వేదికగా గురువారం నుంచి 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 8 వరకు జరగనున్న ఈ పోటీల్లో 187 దేశాల నుంచి ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 343 జట్లు పతకాల కోసం పోటీపడతాయి. ఈ టోర్నీలో ఓపెన్ సెక్షన్‌లో 188 టీమ్‌లు పోటీపడుతుండగా.. మహిళల కేటగిరిలో 162 జట్టు తలపడనున్నాయి.
భారత్ తరఫున మొత్తం 6 టీమ్‌లకు చెందిన 30 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో మూడు టీమ్‌లు ఓపెన్ కేటగిరిలో పోటీపడుతుండగా.. మరో మూడు టీమ్స్ మహిళల కేటగిరిలో తలపడనున్నాయి. ఒక్కో టీమ్‌లో ఐదుగురు సభ్యులు ఉండనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ఈ మెగా టోర్నీ ఆరంభ వేడుకులకు సంబంధించిన రిహార్సల్స్ జరుగుతున్నాయి. యావత్ చెస్ ప్రపంచం నివ్వెరపోయేలా తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రారంభ వేడుకల్లో భాగంగా చిన్నారులతో పెద్ద చెస్ బోర్డును రీక్రియేట్ చేసింది. ఇందులో చిన్నారులు చెస్ పావుల్లా వేశం ధరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెస్ దిగ్గజాలంతా ఈ టోర్నీలో పాల్గొంటుండటంతో తమిళనాడు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. మొత్తం 4 వేల మంది పోలీసులు ఈ టోర్నీ భద్రతలో పాలుపంచుకోనున్నారు.
స్పానిష్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఫ్రాన్సిస్కో వల్లేజో పోన్స్ నిర్వాహకుల ఏర్పాట్లను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. తనకు ఘన స్వాగతం లభించిందని సంతోషం వ్యక్తం చేశాడు. 'ఈ ఉదయమే చెన్నై చేరుకున్నాను. ఇక్కడ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఉక్కపోత వాతావరణంతో పాటు వాలంటీర్స్, స్టాఫ్ స్వాగతం పలికిన తీరు అద్భుతం. ఎక్కడా వేచి ఉండాల్సిన పనిలేదు'అని ట్వీట్ చేశాడు.