బకూ(అజర్‌బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగం టైటిల్ కోసం భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద, వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్(నార్వే) మధ్య జరిగిన రెండో గేమ్ 'డ్రా'గా ముగిసింది. తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఈ గేమ్‌లో నల్ల పావులతో ఆడాడు. 30 ఎత్తుల తర్వాత ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ డ్రాకు అంగీకరించారు.
గంటలోపే ముగిసిన ఈ పోరు ఆరంభంలో ప్రజ్ఞానంద ఆధిక్యంలో నిలిచాడు. కానీ కార్ల్‌సన్ పై ఎత్తులు వేయడంతో ప్రజ్ఞానంద ఆ జోరును కొనసాగించలేకపోయాడు. గురువారం జరిగే టైబ్రేక్ గేమ్‌ల ద్వారా విజేతను నిర్ణయించనున్నారు. మంగళవారం జరిగిన తొలి గేమ్ 35 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది.

ఇక సెమీస్‌లో ప్రజ్ఞానంద 3.5-2.5 తేడాతో అమెరికా గ్రాండ్‌మాస్టర్ కరువానాను మట్టికరిపించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టిన రెండో భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు.
హోరాహోరీగా సాగిన సెమీస్‌లో మొదటి నుంచి అగ్రశ్రేణి ఆటగాడైన అమెరికా గ్రాండ్‌మాస్టర్ కరువానాకు గట్టి పోటీనిచ్చిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద.. టైబ్రేక్‌లోనూ పట్టు వదలకుండా పోరాడాడు. మొదట తొలి రెండు క్లాసికల్ గేమ్‌లు డ్రా కావడంతో పోరు టైబ్రేక్‌కు మళ్లిన సంగతి తెలిసిందే.
సోమవారం టైబ్రేక్‌లో భాగంగా జరిగిన తొలి రెండు ర్యాపిడ్ గేమ్‌లు కూడా డ్రా అయ్యాయి. తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన చెన్నై కుర్రాడు ప్రజ్ఞానంద 71 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత గేమ్‌లో తెల్లపావులతో ఆడి 53 ఎత్తుల్లో ప్రత్యర్థిని నిలువరించాడు. దీంతో ర్యాపిడ్‌లో రెండో రౌండ్‌కు తెరలేచింది. తొలి గేమ్‌లో తెల్లపావులతో ప్రజ్ఞానంద ఆధిపత్యం చలాయించాడు. కరువానా నుంచి గట్టి సవాలును దాటుకుని 63 ఎత్తుల్లో విజయం సాధించాడు.

ఈ గెలుపుతో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రజ్ఞానంద.. ఆ తర్వాత రసవత్తరంగా సాగిన గేమ్‌ను 82 ఎత్తుల్లో డ్రా చేసుకుని ముందంజ వేశాడు. ఓవరాల్‌గా సెమీస్‌లో ప్రజ్ఞానంద 3.5-2.5 తేడాతో కరువానాపై నెగ్గాడు. ఈ విజయంతో 2024 క్యాండిడేట్ టోర్నీలో చోటు ఖాయం చేసుకున్న ప్రజ్ఞానంద.. బాబి ఫిషర్, కార్ల్‌సన్ తర్వాత ఆ పోటీల్లో తలపడే మూడో పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు.
అంతే కాకుండా 2005లో ప్రపంచకప్‌లో నాకౌట్ ఫార్మాట్ ప్రవేశపెట్టిన తర్వాత ఫైనల్ చేరిన తొలి భారత ఆటగాడు అతనే. అంతకుముందు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగిన ప్రపంచకప్‌ల్లో ఆనంద్ 2000, 2002లో టైటిల్ నెగ్గాడు.