చెస్ ఒలింపియాడ్ 2024లో భారత జట్ల జోరు కొనసాగుతోంది. హంగేరి రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో తొలిసారి గట్టి పోటీని ఎదుర్కొన్నా.. భారత పురుషులు, మహిళల జట్లు వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేశాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3-1తో ఆతిథ్య హంగేరిని ఓడించింది.
గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి వరుసగా ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. జుగిరోవ్ సమన్‌ను అతను ఓడించాడు. బెంజమిన్‌పై విదిత్ గుజరాతి విజయం సాధించగా.. రిచర్డ్‌తో గేమ్‌ను గుకేశ్, పీటర్ లేకోతో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించారు. మహిళల జట్టు 2.5-1.5 తేడాతో అర్మేనియాపై విజయం సాధించింది.

తెల్లపావులతో ఆడిన దివ్య దేశ్‌ముఖ్ 40 ఎత్తుల్లో ఎలీనాను ఓడించింది. లిలిత్‌తో గేమ్‌ను ద్రోణవల్లి హారిక, మరియంతో గేమ్‌ను వైశాలి, అనాతో గేమ్‌ను తానియా సచిన్‌దేవ్ డ్రాగా ముగించారు.
గుకేశే ఫేవరెట్..
వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశే ఫేవరేట్ అని డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ అన్నాడు. లిరెన్, గుకేశ్‌ల మధ్య నవంబర్‌లో జరగనున్న ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పోరు గురించి తాజాగా మాట్లాడిన లిరెన్.. గత ఏడాదిగా తన ఫామ్ తగ్గిందన్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ చెస్ ఒలింపియాడ్ ఆడుతున్నారు.
'చెస్ ఒలింపియాడ్‌లో గుకేశ్ బాగా ఆడుతున్నాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో అతనే ఫేవరేట్ అనిపిస్తోంది. నాకన్నా అతని రేటింగ్ కూడా ఎక్కవే. గతేడాదిగా నా ఫామ్ కోల్పోయా. కానీ గెలవడానికి 100 శాతం ప్రయత్నిస్తా. భారత్, చైనాలు బలమైన జట్లు. చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం కోసం ఈ ఇరు జట్లు తలపడే అవకాశం ఉంది'అని లిరెన్ చెప్పుకొచ్చాడు. ఏప్రిల్‌లో క్యాండిడేట్స్ టోర్నీ గెలవడం ద్వారా గుకేశ్.. అత్యంత పిన్నవయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం గుకేశ్ వయసు 17 ఏళ్లు మాత్రమే.