For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Neeraj Chopra: బళ్లెం వీరుడికి ఆకాశమే హద్దు.. గాయాలతో పోరాడిన గోల్డెన్ బాయ్!

హైదరాబాద్: రెండేళ్ల క్రితం 100 ఏళ్ల కలను సాకారం చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ కాంతులు విరజిమ్మిన నీరజ్ చోప్రా మరోసారి దేశం గర్వించే ప్రదర్శన కనబర్చాడు. అథ్లెటిక్స్‌లో మేటి పోటీ అయిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. ఏడాది క్రితమే రజతం సరికొత్త చరిత్రకు బాటలు వేసిన నీరజ్ చోప్రా.. ఈసారి ఆనందాన్ని డబుల్ చేశాడు.

చరిత్ర సృష్టించాలన్నా.. కొత్త చరిత్ర లిఖిచాలన్నా తనకు మాత్రమే సాధ్యమని నీరజ్ చోప్రా మరోసారి చాటి చెప్పాడు. ఆది వారం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఫైనల్లో బళ్లెంను 88.17 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఆసియా ఛాంపియన్ అయినా.. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి సాధించినా నీరజ్ చోప్రా విజయకాంక్ష తగ్గలేదు.

Check Neeraj Chopras fitness journey after he wins historic World Athletics Championships Gold

ఏకంగా ఒలింపిక్స్‌లో పసిడిని పట్టేసి చరిత్ర సృష్టించినా.. అతని కసి తీరలేదు. ఇంకా ఏదో వెలితి.. మరేదో సాధించాలన్న తపన అతడిని వెంటాడింది. ఇన్నాళ్లు ఊరించిన వరల్డ్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్ పతకాన్ని ఎలాగైనా అందుకోవాలని నీరజ్ చోప్రా భావించాడు. గతేడాది తృటిలో చేజారిన బంగారు పతకాన్ని ఈ సారి అందుకున్నాడు.

ఈ విజయం కోసం ఎన్నో అవరోధాలను దాటుకుంటూ... గాయాలను ఓర్చుకుంటూ అనుకున్నది సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచిన తర్వాత నీరజ్ చోప్రా.. దేశంలో హీరో అయిపోయాడు. ప్రైజ్‌మనీ, వ్యాపార ఒప్పందాలతో అతనిపై కోట్ల వర్షం కురిసింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానగణం పెరిగింది.

25 ఏళ్ల వయసులోనే ఊహించని ఇలాంటి స్టార్‌డమ్‌తో ఆటపై ఫోకస్ పెట్టడం కత్తిమీద సామే. నీరజ్ చోప్రా మాత్రం ఎంతో పరిపక్వతతో ఇవన్నీ తాత్కలిమని గ్రహించి ఆటను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టిపెట్టాడు. ఈ క్రమంలో అతను గాయాలతోనూ పోరాడాడు. ఒలింపిక్స్ తర్వాత గతేడాది జరిగిన అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ గెలిచిన నీరజ్ భుజానికి గాయమైంది.

ఆ టోర్నీ ఫైనల్లో నాలుగో త్రో టైమ్‌లో కండరాల్లో చీలిక రావడంతో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పాల్గొనలేదు. ఈ గాయం నుంచి కోలుకొని డైమండ్ లీగ్‌లో సత్తా చాటిన నీరజ్ చోప్రా.. ఈ ఏడాది ఆరంభంలో మరోసారి గాయపడ్డాడు. నెలరోజుల పాటు ఇంటికే పరిమితమయ్యాడు.

ఈ సీజన్‌లో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌తో పాటు ఆసియా గేమ్స్ కూడా ఉండటంతో ఫిట్‌నెస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన నీరజ్ చోప్రా.. విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు నీరజ్ చోప్రా పక్క ప్లానింగ్‌తో ప్రిపేర్ అయ్యాడు. పరిమిత టోర్నీలు ఆడాడు. ఈ ఏడాది మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్ 88.67 మీటర్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అదే నెలలో జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచాడు.

మే నెలలో మరోసారి కండరాల గాయానికి గురైన నీరజ్ చోప్రా.. జూలై వరకు ఆటకు దూరంగా ఉన్నాడు. లుసానెలో జరిగిన డైమండ్ లీగ్ ఈటెను 87.66 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ముంగిట అంచనాలను పెంచుకున్నాడు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే పసిడి సాధించి ఔరా అనిపించాడు.

ఓ అథ్లెట్ తన కెరీర్‌లో ఒలింపిక్ గోల్డ్, వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్, వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌‌లో ఒక్కటి సాధిస్తేనే గొప్పగా భావిస్తారు. కానీ నీరజ్ చోప్రా 25 ఏళ్ల వయసులోనే ఈ మూడు ఘనతలను అందుకున్నాడు.

Story first published: Monday, August 28, 2023, 8:17 [IST]
Other articles published on Aug 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+