భారత 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన సీపీ రాధాకృష్ణన్... ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్‌పై విజయం సాధించారు. మొత్తం 781 మంది సభ్యులకుగానూ 767 మంది పార్లమెంట్ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా.. సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. జగ్‌దీప్ దన్కడ్ ఆకస్మిక రాజీనామాతో ఈ ఎన్నికను నిర్వహించాల్సి వచ్చింది. నయా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు బలమైన రాజకీయ, క్రీడా నేపథ్యం ఉంది.
1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించిన రాధాకృష్ణన్.. కాలేజీ రోజుల్లో టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. ఆయన తమిళనాడు, తూత్తుకుడిలోని వీఓ చిదంబరం కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఆ సమయంలోనే రాధాకృష్ణన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఇదే ఆయన కెరీర్‌లో తొలి అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు. టేబుల్ టెన్నిస్‌తో పాటు అథ్లెటిక్స్‌లోనూ నయా ప్రెసిడెంట్ తన ప్రతిభను చాటుకున్నారు. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అయిన రాధాకృష్ణన్ క్రికెట్, వాలీబాల్ కూడా ఆడేవారు.

16 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్), భారతీయ జన సంఘ్ సంస్థలతో కలిసి పని చేశారు. 1974లో సంఘ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన 1998 లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి పోటీ చేసి 1.5 లక్షల ఓట్ల మేజార్టీతో భారీ విజయం సాధించారు. రాజకీయ మార్పుల కారణంగా 1999లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన 55 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి సన్నిహితుడిగా రాధాకృష్ణన్‌కు పేరుంది. ఝార్కండ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.