కోపెన్‌హాగెన్: భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ సంచలన విజయాన్నందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో వరల్డ్ నెంబర్ వన్, ఒలింపిక్ చాంప్ విక్టర్ అక్సెలెన్స్‌కు షాకిచ్చాడు. ఈ విజయంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ప్రణయ్ పతకం ఖాయం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో దుమ్మురేపుతున్న భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగారు.
శుక్రవారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 8వ సీడ్ ప్రణయ్ 19-21, 21-18, 21-8తో టాప్ సీడ్ విక్టర్ అక్సెలెన్స్ (డెన్మార్క్)ను ఓడించాడు. తనపై 7-2తో మెరుగైన రికార్డున్న అక్సెలెన్స్‌తో తొలి గేమ్ ఓడిపోయిన ప్రణయ్.. అసాధారణ ఆటతీరుతో పుంజుకున్నాడు.
తొలి గేమ్‌లో 12-17తో వెనుకబడిన ప్రణయ్ పుంజుకుని వరుసగా అయిదు పాయింట్లతో స్కోరు సమం చేసాడు. కానీ డెన్మార్క్ ప్లేయర్ తన జోరును కొనసాగించి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.

రెండో గేమ్ ఆరంభంలోనూ ప్రణయ్ 1-7తో వెనుకబడటంతో ఓటమి తప్పదని అంతా అనుకున్నారు. కానీ ప్రణయ్ ఏ మాత్రం పట్టు వదలకుండా పోరాడాడు. వరుసగా పాయింట్లు సాధించి 15-15తో స్కోరు సమం చేశాడు. 17-17 వద్ద ప్రణయ్ దూకుడుగా ఆడి అక్సెలెన్స్‌కు షాకిచ్చాడు. వరుసగా మూడు పాయింట్లతో గేమ్ విజయానికి చేరువయ్యాడు.
అక్సెలెన్స్ అతణ్ని అందుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్ మాత్రం ఏకపక్షమైంది. అప్పటికే అలసిపోయిన అక్సెలెన్స్ ప్రణయ్ దూకుడు ముందు నిలవలేకపోయాడు. 5-5 వద్ద విజృంభించిన అతను.. వరుసగా పాయింట్లు కొల్లగొడుతూ 16-6తో పైచేయి సాధించాడు. ఆ తర్వాత ప్రణయ్ విజయం లాంఛనమే అయింది.
గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి, మరోసారి మెడల్ ఫేవరెట్లుగా టోర్నీలో అడుగు పెట్టిన సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టిలకు నిరాశే ఎదురైంది. క్వార్టర్స్ చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచిన ఈ జోడీకి కిమ్ ఆస్ట్రప్-ఆండర్స్ స్కారుప్ జోడీ చెక్ పెట్టింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో భారత ద్వయం 18-21, 19-21తో డెన్మార్క్ జంట చేతిలో పరాజయం పాలైంది.
ఈ మ్యాచ్‌లో భారత డబుల్స్ జోడీ చేసిన తప్పిదాలు ప్రత్యర్థులకు కలిసొచ్చాయి. ఆరంభం నుంచే తడబడ్డ భారత్ జోడీ.. ఆ తర్వాత పుంజుకున్నా ఫలితం లేకపోయింది. రెండో గేమ్‌లో 15-15తో స్కోరు సమం చేసి మ్యాచ్‌ను నిర్ణయాక గేమ్‌కు మళ్లించేలా కనిపించినప్పటికీ ప్రత్యర్థులు అవకాశం ఇవ్వలేదు.
ఇక్కడి నుంచి ప్రతి పాయింట్ కోసం పోరాటం తీవ్ర స్థాయిలో సాగింది. కానీ ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ ప్రత్యర్థి జోడీ గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.