పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సహచర భారత అథ్లెట్ల నుంచి స్టార్ రెజ్లర్లు, నెటీజన్లు వినేష్ ఫోగట్ విజయాన్ని కొనియాడుతున్నారు. ఒలింపిక్స్ చరిత్రలోనే ఫైనల్ చేరిన తొలి భారత రెజ్లర్‌గా వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీపడుతున్న వినేష్ ఫోగట్.. మంగళవారమే జరిగిన సెమీఫైనల్లో 5-0 తేడాతో క్యూబా రెజ్లర్ యుస్నీలీస్ గుజ్మాన్‌ను ఓడించింది.
ఈ విజయంతో వినేష్ ఫోగట్ రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. పసిడి పతకానికి ఆమె మరో అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. ఈ నేపథ్యంలో రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతక విజేత అయిన బజరంగ్ పునియా ఆమెను సోషల్ మీడియా వేదికగా అభినందించాడు.

భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన చేపట్టిన సమయంలో వినేష్ ఫోగట్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును గుర్తు చేశాడు. 'వినేష్ ఫోగట్ నేడు ఒలింపిక్స్‌లో వరుస మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ సుసాకీని చిత్తు చేసింది. కానీ మీ అందరికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. ఈ అమ్మాయి స్వదేశంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది.
ఛాంపియన్ ప్లేయర్‌ను వీధుల్లోకి లాగారు. మరెన్నో గాయాలను తట్టుకుంది. స్వదేశంలో వినేష్ ఫోగట్ పోరాటం చేయాల్సి వచ్చింది. అలాంటి అమ్మాయి ఇప్పుడు ప్రపంచాన్ని జయించబోతుంది. కానీ ఈ దేశంలోనే వ్యవస్థల ముందు వినేష్ ఫోగట్ ఓడిపోయింది.'అని ఎక్స్‌లో బజరంగ్ పూనియా పేర్కొన్నాడు.
వినేష్ ఫోగట్ ఫైనల్ విజయానంతరం ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. ఈ విజయం బ్రిజ్‌భూషన్‌చరణ్ సింగ్‌కు చెంపపెట్టని అభిప్రాయపడ్డాడు. కులాలు, రాష్ట్రాల పేరిట రెజ్లింగ్ ఫెడరేషన్‌ను విభజించారని, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ఆమె విజయం గురించి మాట్లాడుతారని ప్రశ్నించాడు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ చరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో వినేష్ ఫోగట్ చురుకుగా పాల్గొంది. ఈ నిరసనల నేపథ్యంలో ఆమె పూర్తిగా ఆటను పక్కనపెట్టేసింది. చాలా రోజుల పాటు ఈ ఆందోళనలు జరగ్గా.. పోలీసుల చేతుల్లో కూడా దెబ్బలు తిన్నది. తాను సాధించిన మెడల్స్‌ను గంగలో వేసేందుకు కూడా సిద్దమైంది.
ఒలింపిక్స్ కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో జూనియర్ చేతిలో ఓడింది. దాంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యింది. ఎన్నో అవమానాలు, అవహేళనలను ఎదుర్కొంది. ఇవన్నింటికీ తన గెలుపుతోనే సమాధానమిచ్చింది. రెగ్యూలర్‌గా ఆడే 53 కేజీల కేటగిరిలో అంతిమ్ పంఘల్ ఒలింపిక్స్ అర్హత సాధించడంతో.. వినేష్ ఫోగట్ 50 కేజీల విభాగానికి మారింది. దాంతో ఆమె గెలవడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ వినేష్ ఫొగట్ సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరి పతకాన్ని ఖాయం చేసింది.