రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో భారత రెజ్లర్లు మళ్లీ నిరసన బాట పట్టారు. ఈ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్టార్ రెజ్లర్, ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా మరో స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి బజరంగ్ పూనియా ఓ లేఖ రాసాడు. ఆ లెటర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 'డియర్ మోదీజీ.. మీరు మీ పనుల్లో ఎంతో బిజీగా ఉంటారని తెలుసు. కానీ ఈ దేశంలో రెజ్లర్ల పరిస్థితిని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాను. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరిలో మహిళా రెజర్లు ఆందోళన చేసిన విషయం మీకు తెలిసిందే.

వారికి మద్దతుగా నేను కూడా ఆ ఆందోళనల్లో పాల్గొన్నాను. ఆ ఆరోపణలపై చర్యలు తీసుకుంటారని మీ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. దాంతో మేం ఆందోళనను విరమించాం. కానీ, నెలలు గడిచినా బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు. న్యాయం కోసం మా మెడల్స్‌ను గంగలో కలిపేద్దామనుకున్నప్పుడు.. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కానీ ఇప్పుడు డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల ఫలితాలతో రెజ్లింగ్ ఫెడరేషన్ మళ్లీ బ్రిజ్‌భూషణ్ చేతుల్లోకి వెళ్లినట్లు అయ్యింది. ఈ ఫలితాలను భరించలేక సాక్షి మాలిక్ ఆటకు వీడ్కోలు పలికింది. ఇప్పుడు మేం ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వం మాకు ఎంతో చేసింది. మా అత్యుత్తమ ప్రదర్శనను గుర్తించింది. 2019లో నన్న పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
అర్జున, ఖేల్‌రత్న వంటి అవార్డులు కూడా వచ్చాయి. కానీ మహిళా రెజ్లర్లు తమకు భద్రత లేదని ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. ఇది నన్ను ఎంతగానో బాధిస్తోంది. అందుకే నా పద్మశ్రీ అవార్డు మీకే తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నాను.'అని బజరంగ్ పునియా ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ తదితర రెజ్లర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దాంతో డబ్ల్యూఎఫ్‌ఐ పాలక వర్గాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది.
తాజాగా జరిగిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ప్రధాన అనుచరుడు అయిన సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. మహిళా రెజ్లర్ల నిరసనకు అండగా నిలిచిన మాజీ రెజ్లర్ అనితా షెరాన్‌పై ఆయన విజయం సాధించాడు. దాంతో భారత రెజ్లర్లు మళ్లీ నిరసన బాట పట్టారు. చేసేదేం లేక ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు.