కరాచీ: పాకిస్థాన్ స్టార్ స్నూకర్, ఆసియా అండర్ 21 సిల్వర్ మెడలిస్ట్ మాజిద్ అలీ ఆత్మహత్య చేసుకున్నాడు. పాకిస్థాన్, పంజాబ్‌లోని ఫైసలాబాద్‌లో తన నివాసంలో మాజీ అలీ సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టించింది. రంపం మెషిన్‌తో గాయపరుచుకొని చనిపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.
కొంతకాలంగా మాజిద్ అలీ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, కెరీర్ పరంగా ఎదురైన కష్టాలతో డిప్రెషన్‌కు వెళ్లినట్లు అక్కడి పోలీసులు మీడియాకు తెలిపారు. అతనికి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని.. నిరాశ నిసృహల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టం చేశారు.

ఇక పాకిస్థాన్ తరపున అత్యంత చిన్న వయసులోనే స్నూకర్ గేమ్(బిలియర్డ్స్)లో సంచలనాలు సృష్టించిన మాజిద్ అలీ జాతీయ స్థాయిలో చాలాకాలం పాటు అగ్ర ప్లేయర్‌గా కొనసాగాడు. పాకిస్థాన్‌లో అంతర్జాతీయ స్నూకర్ పోటీలకు బాగా ప్రాచుర్యం ఉంది. మాజీ ప్లేయర్లు మహ్మద్ యూసఫ్, ముహ్మద్ ఆసిఫ్‌లు వరల్డ్, ఆసియా చాంపియన్‌షిప్‌లను కూడా గెలుచుకున్నారు.
వారి తర్వాత ఆ స్థాయిలో స్నూకర్‌లో మంచి పేరు తెచ్చుకున్న 28 ఏళ్ల మాజిద్ అలీ.. ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో పాకిస్థాన్ క్రీడారంగంలో విషాద చాయలు అలుముకున్నాయి.ఈ నెల ఆరంభంలోనే మరో అంతర్జాతీయ స్నూకర్ ముహమ్మద్ బిలాల్ గుండెపోటుతో మరణించాడు. తాజాగామరో స్నూకర్ ప్లేయర్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది.
మాజిద్ అలీ సోదరుడు ఉమర్ మాజిద్ మాట్లాడుతూ.. ''టీనేజీ వయసు నుంచే వాడు(మాజిద్ అలీ) మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని మాత్రం ఊహించలేదు. వాడి మరణం మాకు తీరని లోటు'' అని తెలిపాడు.
పాకిస్తాన్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ చైర్మన్ అలమ్‌గిర్ షేక్ స్పందిస్తూ.. ''మాజిద్ మరణం ఎంతో బాధాకరం. ఎంతో టాలెంట్ కలిగిన అతను బిలియర్డ్స్ గేమ్‌లో పాకిస్థాన్‌ను ఉన్నత స్థానంలో నిలిపాడు. అతనికి మా నివాలి'అని చెప్పుకొచ్చాడు.