హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం భారత అథ్లెట్లు రెండు గోల్డ్ మెడల్స్‌తో సహా మొత్తం 8 పతకాలు ఖాతాలో వేసుకున్నారు. షూటింగ్ విభాగంలోనే ఐదు మెడల్స్ దక్కాయి. యువ షూటర్ పాలక్ గులియా ఒక గోల్డ్, సిల్వర్ సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన పాలక్.. అదే పోటీ టీమ్ విభాగంలోనూ సిల్వర్ సాధించింది.
హైదరబాద్ షూటర్ చార్‌మార్..
వ్యక్తిగత విభాగం ఫైనల్లో పాలక్ (242.1 పాయింట్లు) అగ్రస్థానం సాధించగా.. హైదరాబాదీ యువ షూటర్ ఇషా సింగ్ (239.7) రెండో స్థానంతో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. పాలక్, ఇషాలిద్దరి వయసూ 17 ఏళ్లే కావడం గమనార్హం. వీళ్లిద్దరూ దివ్యతో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు.

ఈ ముగ్గురిలో అత్యధికంగా ఇషా 579 పాయింట్లు సాధించగా.. పాలక్ 577, దివ్య 575 పాయింట్లు నమోదు చేసింది. మొత్తంగా 1731 పాయింట్లతో భారత్ రెండో స్థానం సాధించగా... చైనా (1736) పసిడి నెగ్గగా.. చైనీస్ తైపీ (1723) కాంస్యం దక్కించుకుంది. ఇషా ఇప్పటికే 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజతం, టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.

పురుష షూటర్లు సైతం..
పురుష షూటర్లు కూడా అదే జోరును కొనసాగించారు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్, స్వప్నిల్ కుశాలె, అఖిల్ షియొరాన్‌లతో కూడిన భారత జట్టు ప్రపంచ రికార్డు స్కోరుతో స్వర్ణం సాధించింది. ఈ జట్టు 1769 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. చైనా బృందం 1763 పాయింట్లతో రెండో స్థానం, దక్షిణ కొరియా 1748 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
8 పాయింట్ల తేడాతో గత రికార్డును భారత బృందం అధిగమించింది. టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన ఐశ్వరీ ప్రతాప్.. వ్యక్తిగత విభాగంలో మాత్రం తృటిలో గోల్డ్ మెడల్ చేజార్చుకున్నాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత ఈవెంట్లో అతను 459.7 పాయింట్లు సాధించి సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు.
చైనా క్రీడాకారుడు డు లిన్‌షు 460.6 పాయింట్లతో స్వర్ణం గెలవగా.. ఈ పోటీలో చాలాసేపు అగ్రస్థానంలో ఉన్న మరో భారత షూటర్ స్వప్నిల్.. ఒక పేలవ షాట్‌తో 7.6 పాయింట్లే సాధించడంతో నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.
స్వాష్‌లో 2 మెడల్స్..
స్క్వాష్ ఈవెంట్‌లో భారత్‌కు టీమ్ విభాగంలో రెండు మెడల్స్ దక్కాయి. పురుషుల జట్టు ఫైనల్ చేరి పసిడి రేసులో నిలవగా.. సెమీఫైనల్లో ఓడిన మహిళల జట్టు బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. సౌరభ్ ఘోషల్, అభయ్‌సింగ్, హరీందర్ పాల్‌తో కూడిన పురుషుల టీమ్ సెమీఫైనల్లో 2-0తో మలేసియాను ఓడించింది.
స్వర్ణ పతక పోరులో దాయాదీ పాకిస్థాన్‌తో తలపడనుంది. మహిళల విభాగంలో భారత్ కాంస్యంతో సరిపెట్టుకుంది. జోష్న, అనహత్‌సింగ్, తన్వీ ఖాన్నాలతో కూడిన జట్టు సెమీఫైనల్లో 1-2తో హాంకాంగ్ చేతిలో ఓటమి పాలైంది.

షాట్‌పుట్‌లో తొలి పతకం..
ఆసియా క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో భారత్ శుభారంభం చేసింది. మహిళల షాట్‌పుట్‌లో కిరణ్ బలియాన్ అథ్లెటిక్స్ పోటీల తొలి రోజే బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. గుండును 17.36 మీటర్ల దూరం విసిరిన ఆమె మూడో స్థానంలో నిలిచింది. 72 ఏళ్ల ఆసియా గేమ్స్ చరిత్రలో షాట్‌పుట్‌లో పతకం నెగ్గిన తొలి భారత మహిళగా కిరణ్ బలియాన్ చరిత్రకెక్కింది.
శుక్రవారం ఒక్కరోజే 8 పతకాలు రావడంతో భారత్ ఖాతాలో మొత్తం 33 మెడల్స్ చేరాయి. ఇందులో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యలున్నాయి. పతకాల పట్టికలో 200 మెడల్స్‌తో చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 99 పతకాలతో జపాన్, 102 మెడల్స్ కొరియా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 33 మెడల్స్ భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.