హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌లో భారత స్టార్ బాక్సర్, వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. మహిళల 50 కేజీల తొలి రౌండ్‌లో ఈ తెలంగాణ అమ్మాయి 5-0తో రెండుసార్లు ఆసియా ఛాంపియన్ అయిన తి తామ్ గుయెన్ (వియత్నాం)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్స్ చేరింది. మార్చిలో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్ తర్వాత ఎన్‌గుయెన్‌తో మరోసారి తలపడ్డ తెలంగాణ బిడ్డ అదే ఫలితాన్ని మరోసారి పునరావృతం చేసింది.
తొలి రెండు రౌండ్లలో నిఖత్ కచ్చితమైన పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. తొలి రౌండ్లో అయితే తెలంగాణ బిడ్డ పంచ్‌లకు గుయెన్ రెండుసార్లు నాకౌట్ అయ్యేలా కనిపించింది. ఆ తర్వాత గుయెన్ పుంజుకుని అటాకింగ్ గేమ్ ఆడింది. అయితే పంచ్‌ల పదును మరింత పెంచిన నిఖత్.. అదే జోరుతో విజయాన్ని సొంతం చేసుకుంది.

మరో భారత బాక్సర్ ప్రీతి పన్వర్ 54 కేజీల విభాగంలో క్వార్టర్స్ చేరింది. ప్రిక్వార్టర్స్‌లో సిలీనా (జోర్డాన్)ను ఆమె చిత్తు చేసింది.
టేబుల్ టెన్నిస్‌లో నిరాశ..
టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. గత ఆసియా గేమ్స్‌లో కాంస్యం గెలిచిన పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు ఈ సారి నిరాశాజనక ప్రదర్శన చేశాయి. ముందుగా మహిళల టీమ్ విభాగంలో 2-3తో థాయ్‌లాండ్ చేతిలో ఓడి క్వార్టర్స్‌కు దూరమైంది. మరోవైపు పురుషుల జట్టు క్వార్టర్స్ చేరినా.. అంతకుమించి ముందంజ వేయలేకపోయింది. క్వార్టర్స్‌లో భారత్ 0-3తో ద్వితీయ శ్రేణి దక్షిణ కొరియా చేతిలో ఓటమిపాలైంది.
వాలీబాల్‌లోనూ భారత్ మెడల్ రేసు నుంచి తప్పుకుంది. పురుషుల జట్టు గ్రూప్-సి చివరి మ్యాచ్‌లో 0-3తో జపాన్ చేతిలో చిత్తయింది. రగ్బీలోనూ కలిసిరాలేదు. గ్రూప్‌లో భారత మహిళల జట్టు మొదట 0-38తో హాంకాంగ్ చేతిలో.. ఆ తర్వాత 0-45తో జపాన్ చేతిలో ఓడింది. దీంతో భారత్‌కు సెమీస్ చేరే అవకాశాలు లేకుండా పోయాయి.
మహిళల ఫుట్‌బాల్‌లోనూ భారత్ నాకౌట్ చేరలేకపోయింది. గ్రూప్-బి ఆఖరి మ్యాచ్‌లో భారత్ 0-1తో థాయ్‌లాండ్ చేతిలో ఓడింది. మరోవైపు మయన్మార్‌తో 1-1తో డ్రా చేసుకున్న పురుషుల జట్టు ప్రిక్వార్టర్స్ చేరింది. వుషూలో చాంగ్‌క్వాన్ ఈవెంట్లో సూరజ్ సింగ్, అంజుల్ 5, 6 స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఈ-స్పోర్ట్స్‌లో ఎస్‌సీ ఆన్‌లైన్-4 గేమ్‌లో చరణ్‌జ్యోత్ సింగ్, కమ్రానన్ టిక్కా ఓటమి పాలయ్యారు.