హంగ్జౌ: కిక్కెక్కించే బాక్సింగ్.. ఉత్తేజపరిచే రన్నింగ్.. మంత్రముగ్దుల్ని చేసే బ్యాడ్మింటన్.. మజానిచ్చే రెజ్లింగ్.. ఇంకా ఎన్నెన్నో! అన్నీ ఒక్క చోటే..! ఆటలే ఆటలు. ఈసారి క్రికెట్ బోనస్. అభిమానులే ఇక సిద్ధం కావాలి. ఆసియా ఖండంలో అతి పెద్ద క్రీడా సంబరానికి సమయం ఆసన్నమైంది. పొరుగు దేశం చైనాలో హాంగ్జౌ వేదికగా ఏషియన్ గేమ్స్ 2023కు తెరలేవనుంది.
ఇప్పటికే టీమ్ ఈవెంట్స్ పోటీలు ప్రారంభమైనా.. శనివారం అధికారికంగా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆసియా గేమ్స్‌కు భారత్ సిద్దమైంది. ఆసియా క్రీడల చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో 100 పతకాలు సాధించాలనే లక్ష్యంతో 655 మంది సభ్యులతో కూడిన భారత బృందం బరిలోకి దిగుతోంది.

41 క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు పోటీపడనున్నారు. అత్యధికంగా అథ్లెటిక్స్ విభాగంలో 68 మంది బరిలోకి దిగనున్నారు. 2018 ఆసియా క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 24 రజతాలు సహా 69 పతకాలు గెలుచుకుంది. క్రీడల్లో మనదేశ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఆటగాళ్ల ప్రమాణాలు పెరిగిన నేపథ్యంలో ఈసారి పతకాల సెంచరీ కొట్టడం అసాధ్యమేమీ కాదని భారత్ భావిస్తోంది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఈ సారి భారత్ దుమ్మురేపుతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్, వరల్డ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ టోర్నీలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అతను స్వర్ణం సాధిస్తాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
నీరజ్‌తో పాటు హైదరాబాద్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ (బాక్సింగ్), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్), జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్ డబుల్స్), రుద్రాంక్ష్ పాటిల్ (షూటింగ్), తేజస్విన్ శంకర్ (డెకథ్లాన్), రోహన్ బోపన్న (టెన్నిస్ డబుల్స్), పారుల్ చౌదరి (3000మీ స్టీపుల్ చేజ్), జ్యోతి యర్రాజి (100మీ హర్డిల్స్), పురుషుల హాకీ జట్టు, భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి.
ఒలింపిక్స్ తర్వాత సెకండ్ మల్టీ నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ ఏషియన్ గేమ్స్. ఈ మెగా ఈవెంట్‌లో భారత్ సహా 45 దేశాలు పతకాల కోసం పోటీపడనున్నాయి. వాలీబాల్, ఫుట్‌బాల్, వాలీబాల్ వంటి క్రీడలు ఇప్పటికే మొదలయ్యాయి. భారత్ క్రికెట్లోనూ పోటీపడనుంది. 23వ తేదీ సాయంత్రం 5.30కి హాంగ్‌జౌ స్పోర్ట్స్ పార్క్‌లో ఆరంభ వేడుకలు జరగనున్నాయి.
28 ఒలింపిక్ క్రీడలు సహా 40 క్రీడలు, 61 క్రీడాంశాల్లో ఆసియా క్రీడల్లో అథ్లెట్లు పోటీ పడతారు. 1000కిపైగా పతకాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ దేశాల నుంచి 11 వేల మందికి పైగా అథ్లెట్లు పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.