హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత ఫెన్సర్ భవాని దేవీ పోరాటం ముగిసింది. ఫెన్సింగ్‌లో దేశానికి తొలి పతకం అందించాలనే ఆమె కల నెరవేరలేదు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన భవాని పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. అయితే మ్యాచ్ రిఫరీల తప్పుడు నిర్ణయాల కారణంగానే తాను ఓటమి పాలయ్యానని భవాని దేవీ ఆరోపించింది.
చైనా ఫెన్సర్ గెలవాలనే ఉద్దేశంతో రిఫరీలు తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం జరిగిన మహిళల ఫెన్సింగ్ వ్యక్తిగత సేబర్ విభాగ క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన యాకీ షావో 15-7 తేడాతో భవాని దేవీని చిత్తు చేసింది.

క్వార్టర్స్ తొలి పీరియడ్ ఆరంభంలో మూడు టచ్ పాయింట్స్‌తో ఆధిక్యం కనబర్చిన భవానీ.. ఆ తర్వాత తడబడింది. దాంతో యూకీ షావో 8-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో పీరియడ్‌లోనూ అదే జోరు కొనసాగించిన యూకీ షావో మరో ఏడు టచ్ పాయింట్స్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకొని సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
అయితే తొలి పీరియడ్‌లో రిఫరీ తనకు వ్యతిరేకంగా ప్రవర్తించాడని, టచ్ కాకున్నా చైనా ఫెన్సర్‌కు పాయింట్స్ కేటాయించాడన్ని భవాని ఆరోపించింది. 'మ్యాచ్ ఆరంభంలో రిఫరీ నాకు వ్యతిరేకంగా వ్యహరించారు. అతి తక్కువ సమయంలో చైనీస్ ఫెన్సర్‌కు వరుసగా నాలుగు పాయింట్లు కేటాయించాడు. చైనా ఫెన్సర్ టచ్ చేయకున్నా పాయింట్స్ కేటాయించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మా గేమ్ చాలా వేగంగా జరిగింది.
అంత తక్కువ సమయంలో అన్ని పాయింట్స్ ఎలా ఇచ్చారో అంతుపట్టడం లేదు. ఇందులో నా తప్పేం లేదు. నా చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచించడం నా విజయవకాశాలను దెబ్బతీసింది. తర్వాత ఎంత ప్రయత్నించినా విజయాన్ని అందుకోలేకపోయా. అయితే ఈ పరాజయంపై ఎలాంటి పశ్చాతాపం లేదు.'అని భవాని దేవీ చెప్పుకొచ్చింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా భవాని దేవి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.