బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్‌లో భారత స్ప్రింటర్, తెలుగు అమ్మాయి జ్యోతి యర్రాజి స్వర్ణంతో మెరిసింది. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి బరిలోకి దిగిన జ్యోతి పసిడి పతకం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన 23 ఏళ్ల జ్యోతి.. మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో విజేతగా నిలిచింది.
అంతర్జాతీయ టోర్నీల్లో ఆమె స్వర్ణం గెలవడం ఇదే తొలిసారి. గురువారం జరిగిన ఫైనల్లో జపాన్ స్ప్రింటర్ల కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన జ్యోతి 13.09 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకొని పసిడి పతకాన్ని అందుకుంది. ఈ పోటీల చరిత్రలోనే 100 మీటర్ల హార్దిల్స్ విభాగంలో భారత్ పసిడి సాధించడం ఇదే తొలిసారి. ఈ ఘనతను అందుకున్న తొలి స్ప్రింటర్‌గా జ్యోతి నిలిచింది.

పసిడి పతకం సాధించిన జ్యోతిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రముఖులతో పాటు క్రీడాకారులు జ్యోతిని అభినందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు.
రెండో రోజు పోటీల్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. జ్యోతి యర్రాజి స్వర్ణంతో పాటు పురుషుల 1500 మీట్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్ కూడ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నాడు. పురుషుల ట్రిపుల్ జంప్ లో అబ్దుల్లా అబూబకర్ స్వర్ణం సాధించాడు.
వెయ్యి మీటర్ల రేసులో అభిషేక్ పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మహిళల 400 మీటర్ల రేసులో ఐశ్వర్య కైలాష్ మిశ్రా కాంస్యాన్ని సాధించింది. పురుషుల డెకాథ్లాన్ లో తేజస్విన్ శంకర్ కాంస్యం దక్కించుకున్నాడు.
బుధవారం ప్రారంభమైన అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తొలి రోజే పతకాల వేట ప్రారంభించింది. తొలి రోజు పోటీల్లో 10 వేల మీటర్ల నడకలో అభిషేక్ పాల్ కాంస్యం గెలిచాడు. 29 నిమిషాల 33.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన అతడు మూడో స్థానంలో నిలిచాడు. రెన్ తజావా (జపాన్, 29 నిమిషాల 18.44 సె), కిముటాయ్ షడ్రక్ (కజక్‌స్థాన్, 29 నిమిషాల 31.63 సె) వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నారు.
మహిళల 400 మీటర్లలో ఐశ్వర్య మిశ్రా ఫైనల్ చేరింది. హీట్స్‌లో ఈ భారత అథ్లెట్ 53.58 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుంది. పురుషుల 400 మీటర్ల పరుగులో మహ్మద్ అజ్మల్ (45.75 సె), రాజేశ్ రమేశ్ (45.91 సె) కూడా తుది పోరుకు అర్హత సాధించారు. మహిళల జావెలిన్‌త్రోలో అన్నురాణి నిరాశపరిచింది. ఫైనల్లో ఉత్తమంగా జావెలిన్‌ను 59.10 మీటర్ల దూరం విసిరిన ఆమె.. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మహిళల 1500 మీటర్ల రేసులో లిల్లీ దాస్ (4 నిమిషాల 27 సెకన్లు) ఏడో స్థానం మాత్రమే సాధించగలిగింది.