న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్ బరిలోకి దిగే అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లకు వీసా నిరాకరించిన చైనాపై భారత్ మండిపడింది. ఉద్దేశ పూర్వకంగా భారత అథ్లెట్లకు వీసా నిరాకరించడాన్ని భారత క్రీడా మంత్రిత్వ శాఖ తప్పుబట్టింది. చైనా చర్యకు నిరసనగా కేంద్ర క్రీడా శాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆ దేశ పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఆటగాళ్లను రాకుండా ఆపడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్దమని తెలిపారు. ఏషియన్ గేమ్స్ బరిలోకి దిగే అథ్లెట్లకు వీసాలను, అక్రిడిటేషన్లను చైనా నిరాకరించింది. కొన్ని రోజుల క్రితమే అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో అంతర్భాగంగా పేర్కొంటూ.. చైనా ఓ మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లు భారత్ తరఫున ఆసియా క్రీడల్లో పాల్గొంటే.. ఆ ప్రాంతం భారత్‌లో భాగమని తామే గుర్తించినట్లు అవుతుందని భావించిన చైనా.. తన దుర్భుద్ధిని బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే భారత క్రీడాకారులను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్ల వీసా నిరాకరించడం ద్వారా చైనా తన దుర్భుద్దిని బయటపెట్టుకుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్బీ మండిపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. భారత అథ్లెట్లపై ఉద్దేశపూర్వకంగా చైనా ఇలా చేయడం ఆసియా క్రీడల స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన భారతీయ వుషు టీమ్ హాంకాంగ్‌కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్జౌకు విమానంలో బయల్దేరింది. అయితే వీరిలో ముగ్గురికి చైనా అనుమతి నిరాకరించడంతో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌కు భారత ఆటగాళ్లను అధికారులు తీసుకువచ్చారు.
అయితే త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని భారత దౌత్య అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆటగాళ్లకు చైనాలో ప్రవేశం నిరాకరించడంపై ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. ఆతిథ్య దేశంగా, చట్టబద్ధంగా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు హాంగ్జౌకు రావాలని చైనా అన్ని దేశాల అథ్లెట్లను స్వాగసతిస్తుందని తెలిపారు.
అయితే అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో అంతర్జాగంగా చైనా ప్రభుత్వం గుర్తించడంలేదని మావో నింగ్ చెప్పుకొచ్చారు.