యుగెనా: పోల్ వాల్ట్ గేమ్‌లో సంచలన రికార్డు నమోదైంది. యుగెనా వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వీడెన్ ప్లేయర్ అర్మాండ్ డుప్లాంటిస్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు.
తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించాడు. పోల్ సాయంతో 6.23 మీటర్ల ఎత్తు దూకి సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో తొలి ప్రయత్నంలో ఈ రికార్డును అందుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన క్లెర్మోంట్ ఫెర్రాడ్ టోర్నీలో 6.22 మీటర్లతో వరల్డ్ రికార్డు నమోదు చేసిన అర్మాండ్ డుప్లాంటిస్.. తాజా ప్రదర్శన తన రికార్డునే అధిగమించాడు.

ఒలింపిక్, ప్రంపచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ ఛాంపియన్స్ టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. శనివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫైనల్లో చోప్రా 83.80 మీటర్లు జావెలిన్‌ను విసిరి రెండో స్థానంలో నిలిచాడు.

గత నెలలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసిన చోప్రా.. శనివారం ఉత్తమ ప్రదర్శన చేయలేకపోయాడు. రెండుసార్లు ఫౌల్ చేసిన చోప్రా 83.80 మీటర్ల త్రో విసిరాడు. వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్) 84.24 మీ దూరం జావెలిన్‌ను విసిరి డైమండ్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచాడు. హెలాండర్ (83.74 మీ- ఫిన్లాండ్) మూడో స్థానం సాధించాడు. చోప్రా 85 మీ. కంటే తక్కువ దూరం విసరడం ఈ సీజన్‌లో ఇదే ప్రథమం. 2022 జ్యురిచ్ డైమండ్ లీగ్ ఫైనల్లో చోప్రా 88.44 మీ త్రో స్వర్ణం సాధించాడు.