
సింగపూర్: మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్‌ఎమ్‌ఏ)లో భారత సంతతి ఆటగాడు అర్జాన్ సింగ్ భుల్లర్ సంచలన ప్రదర్శన నమోదుచేశాడు. ఎమ్‌ఎమ్‌ఏలో వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌గా నిలిచాడు. అయితే ఇండియా ఎమ్‌ఎమ్‌ఏ సెన్సేషన్ రీతూ ఫొగట్‌కు మాత్రం తొలి ఓటమి ఎదురైంది.
ఎంఎంఏలో 10-1తో రికార్డున్న 35 ఏళ్ల అర్జాన్ భుల్లర్.. సింగపూర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన పోటీల్లో డిఫెండింగ్ చాంపియన్ బెండ్రన్ వెరాను నాకౌట్ చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బౌట్ మొత్తం భుల్లర్ అద్భుతమైన పంచ్‌లతో అలరించాడు. ఈ విజయంతో ఎమ్‌ఎమ్ఏ ఈవెంట్‌లో వరల్డ్ టైటిల్ నెగ్గిన తొలి భారత సంతతి ప్లేయర్‌గా గుర్తింపుపొందాడు.
కెనడాలో నివసిస్తున్న అర్జాన్.. 2010 కామన్వెల్త్ క్రీడల్లో రెజ్లింగ్‌లో స్వర్ణం నెగ్గాడు. కొన్నాళ్ల తర్వాత తన కెరీర్‌ను మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌కు మార్చుకొన్న అర్జాన్.. అనతికాలంలో ఎమ్‌ఎమ్‌ఏలో హెవీ వెయిట్ ప్రపంచ విజేతగా నిలవడం విశేషం.
అయితే విమెన్స్ ఆటమ్ వెయిట్ కాంటెస్ట్‌లో భారత క్రీడాకారిణి రీతూ ఫొగట్‌కు చుక్కెదురైంది. అమెరికా ఫైటర్ బై ఎన్‌గుయెన్ చేతిలో ఫొగట్ పోరాడి ఓడింది. మరోవైపు క్యాచ్ వెయిట్ కేటగిరీ(65 కేజీ) ఫైట్‌లో ఇండియా ఫైటర్ గుర్ దర్శన్.. మన దేశానికే చెందిన రోషన్ మైనమ్‌ను చిత్తు చేశాడు.