Archery World Cup Stage 3: దీపిక తీన్మార్.. ఒకేరోజు మూడు స్వర్ణాలు కైవసం!

పారిస్: భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి.. ఆర్చరీ ప్రపంచకప్ మూడో అంచె టోర్నీలో పసిడి పంట పండించింది. ఆదివారం బరిలోకి దిగిన మూడు కేటగిరీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి హ్యాట్రిక్ కొట్టింది. మహిళల రికర్వ్ టీమ్, మిక్స్‌డ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో దీపిక స్వర్ణాలు సాధించింది. దీపికతో పాటు మిగతా భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు అద్భుతమైన ప్రదర్శనతో కొండంత ఆత్మవిశ్వాసాన్ని సంపాదించారు.

దుమ్మురేపిన దీపిక..
మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో దీపిక 6-0తో ఎలెనా ఒసిపోవా (రష్యా)ను చిత్తుచేసి పసిడి పతకం సొంతం చేసుకుంది. మిక్స్‌డ్ టీమ్‌లో దీపిక- అతాను దాస్ జోడీ బంగారు పతకం సాధించింది. దీపిక, అంకిత భకత్, కోమలిక బారిలతో కూడిన భారత రికర్వ్ మహిళల జట్టు గోల్డ్ మెడల్‌తో సత్తా చాటింది. మిక్స్‌డ్ ఫైనల్లో దీపిక- అతాను 5-3తో గాబ్రియెలా ష్లోసర్- వాన్ బెర్గ్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించారు.

ఘనంగా మ్యారెజ్ యానివర్సరీ..
ఒకదశలో 0-2తో వెనుకబడిన దీపిక- అతాను అద్భుతంగా పుంజుకుని భారత్‌కు బంగారు పతకం అందించారు. ప్రపంచకప్‌లో మిక్స్‌డ్ విభాగంలో భారత్ స్వర్ణం సాధించడం ఇదే ప్రథమం. 2016 అంటాల్యా ప్రపంచకప్‌లో దీపిక- అతాను రజతం సాధించారు. గతేడాది జూన్ 30న వివాహ బంధంతో ఒక్కటైన దీపిక- అతాను ప్రపంచకప్‌లో స్వర్ణ పతకంతో మొదటి వార్షికోత్సవాన్ని మరింత చిరస్మరణీయం చేసుకున్నారు.

భారత్ 4
ఇక మహిళల రికర్వ్ టీమ్ ఫైనల్లో భారత్ 5-1తో మెక్సికోను చిత్తుచేసి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ తొలి అంచెలోనూ భారత మహిళల జట్టు స్వర్ణంతో మెరిసింది. మొత్తంగా ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టుకు ఇది ఆరో స్వర్ణం. ఆరు సార్లూ దీపిక బరిలో దిగడం విశేషం. ఈ టోర్నీలో భారత్ 4 స్వర్ణాలు సాధించింది. శనివారం పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్‌వర్మ స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications