
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా గైర్హాజరీలో పాకిస్థాన్ బళ్లెం వీరుడు అర్షద్ నదీమ్ దుమ్మురేపాడు. ఏకంగా నీరజ్ చోప్రా రికార్డులనే చెరపేస్తూ ఈటెన్ 90.18 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. నదీమ్ అత్యుత్త ప్రదర్శనతో పాకిస్థాన్ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకం గెలవగా.. జావెలిన్ త్రోలో ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.
ప్రస్తుత ఫీట్‌తో నదీమ్.. భారత అథ్లెట్, ప్రపంచ నంబర్‌వన్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్ త్రో(87.58 మీటర్ల)ను అధిగమించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ త్రో 88.13 మీటర్లను కూడా దాటేశాడు. ఇటీవల ముగిసిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నదీమ్ ఐదో స్థానంలో నిలవగా.. నీరజ్ చోప్రా 88.13 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే, అతను గాయం కారణంగా చివరి నిమిషంలో కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమయ్యాడు. అతను బరిలోకి దిగి ఉంటే కచ్చితంగా 90 మీటర్ల దూరం విసిరేవాడని జావెలిన్ విశ్లేషకులు అంటున్నారు.
ఇక నదీమ్ స్వర్ణం గెలవడంపై నీరజ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అతన్ని ప్రత్యేకంగా అభినందించాడు. 'అర్షద్ భాయ్ స్వర్ణం సాధించినందుకు అభినందనలు. 90 మీటర్ల త్రో దాటి కొత్త రికార్డు నమోదుచేశావు. భవిష్యత్‌లో మరిన్ని పోటీల్లో గెలవాలి. ఆల్ ది బెస్ట్' అని ట్వీట్ చేశాడు.
దాయాది దేశానికి చెందిన వ్యక్తి, తనకు పోటీదారుగా ఉన్న అర్షద్‌ను నీరజ్ అభినందించడం ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకుంది. నీరజ్ చేసిన ట్వీట్‌పై మహీంద్రా స్పందిస్తూ.. 'ప్రపంచం ఇలా ఉండాలి. పోటీతత్వం, శతృత్వం మధ్య తేడాని స్పష్టంగా ప్రదర్శించినందుకు వారికి బంగారు పతకం ఇవ్వాలి' అని మెచ్చుకున్నారు.
22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు.. మొత్తంగా ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో 61 పతకాలతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది భారత్. 2010లో సొంతగడ్డపై జరిగిన క్రీడల్లో 38 స్వర్ణాలు సహా 101 పతకాలతో పట్టికలో మన దేశానికి రెండో స్థానం దక్కింది. 2002లో 30 స్వర్ణాలు సహా 69 పతకాలు సాధించడం తర్వాతి ఉత్తమ ప్రదర్శన. 2018 నాటి ప్రదర్శన (26 స్వర్ణాలు సహా 66 పతకాలు) మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఉత్తమ ప్రదర్శన అంటే ప్రస్తుత క్రీడల్లోనే. అయితే కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఎప్పుడూ పతకాల పంట పండించే షూటింగ్‌ను ఈసారి పక్కన పెట్టారు.