న్యూఢిల్లీ: ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్లో భారత కుర్రాడైన ప్రజ్ఞానందకు నిరాశే ఎదురైంది. ప్రపంచ నెంబర్ వన్ కార్ల్‌సన్ చేతిలో ఓడిన ప్రజ్ఞానంద తృటిలో ప్రపంచకప్ టైటిల్‌ను చేజార్చుకున్నాడు. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈ 18 ఏళ్ల కుర్రాడు.. టైటిల్ ఫైట్‌లో ఒత్తిడిని అధిగమించలేక ఓటమిపాలయ్యాడు.
36 ఏళ్ల కార్ల్‌సన్ విజేతగా నిలిచినా.. ప్రజ్ఞానంద అంత ఈజీగా ఓటమిపాలవ్వలేదు. వరుసగా రెండు గేమ్స్ డ్రా చేసుకొని టై బ్రేక్‌కు దారీ తీసాడు. అయితే టై బ్రేక్ గేమ్‌లో తడబడిన ప్రజ్ఞానంద ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

టైటిల్ చేజారినా.. రన్నరప్ ట్రోఫీ అందుకున్న ప్రజ్ఞానందపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. 18 ఏళ్లకే ఫైనల్ చేరిన ప్రజ్ఞానందకు మంచి భవిష్యత్తు ఉందని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ప్రతీ విషయంపై స్పందించే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర సైతం ప్రజ్ఞానందను కొనియాడాడు. ఈ ఓటమి ఓ గుణపాఠం మాత్రమేనని తెలిపాడు.
'ప్రజ్ఞానంద నువ్వు రన్నరప్ కాదు.. ఇది నీకు రనప్ మాత్రమే. భవిష్యత్తులో నువ్వు సాధించే గోల్డ్ మెడల్, మరిన్నీ విజయాలకు ఓ గుణపాఠం మాత్రమే. ఈ ఓటమి అనేక యుద్దాలు చేయడానికి కావాల్సిన పాఠాన్ని నేర్పిస్తోంది. భవిష్యత్తులో నువ్వు విజయం సాధించిన అనంతరం మేమంతా మళ్లీ అభినందిస్తాం.'అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశాడు.
ఈ టోర్నీ ఫైనల్లో భాగంగా తొలి రెండు గేమ్స్ డ్రా కావడంతో టై బ్రేక్‌కు దారితీసింది. గురువారం జరిగిన ట్రై బ్రేక్ తొలి గేమ్‌లో 47 ఎత్తులతో గెలిచిన కార్ల్‌సన్.. రెండో గేమ్‌లోనూ అదే జోరును కొనసాగించి ఆధిక్యంలో నిలిచాడు. 27 ఎత్తుల తర్వాత ఇద్దరూ డ్రాకు అంగీకరించడంతో కార్ల్‌సన్ 1.5-0.5 స్కోర్‌తో విజయం సాధించాడు.