గర్భవతులకు బరువులు ఎత్తకూడదని వైద్యులు సూచిస్తుంటారు. గర్భ స్రావమయ్యే అవకాశాలు ఉంటాయని, పుట్టే బిడ్డకు అనారోగ్య సమస్యలు వస్తాయని ముందస్తు జాగ్రత్తలు చెబుతారు. దాంతోనే గర్భవతి అనే విషయం తెలియగానే చాలా మంది మహిళలు విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఏడు నెలల గర్భిణీ అయిన ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సోనికా యాదవ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 145 కిలోల బరువు ఎత్తి దేశ దృష్టిని ఆకర్షించింది. ఆత్మవిశ్వాసం, అభిరుచి, పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకినైనా దాటవచ్చని నిరూపించిన ఆమె కథ ఎంతో మంది మహిళలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ వేదికగా జరిగిన పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీల్లో ఢిల్లీ కానిస్టేబుల్ 31 ఏళ్ల సోనికా యాదవ్ కాంస్య పతకం గెలుచుకుంది. 84 కిలోల విభాగంలో పోటీ పడిన ఆమె స్క్వాట్స్‌లో 125 కిలోలు, బెంచ్ ప్రెస్ 80 కిలోలు, డెడ్ లిఫ్ట్‌లో 145 కిలోల బరువు ఎత్తింది.

ఏడు నెలల గర్భంతో 145 కిలోల బరువు ఎత్తడం చూసి ఇతర క్రీడాకారులు, ప్రేక్షకులతో పాటు నెటిజన్లు అవాక్కయ్యారు. ఆమె బరువు ఎత్తగానే స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమోగింది. ఈ విజయంపై సోనికా సంతోషం వ్యక్తం చేసింది. స్త్రీలు తలుచుకుంటే ఏ పనైనా చేయగలరని పేర్కొంది.
'గర్భం అడ్డంకి కాదు. స్త్రీలు కొన్ని పనులు చేయలేరనే భావన తప్పు. డాక్టర్ల సలహా, సూచనలతో శిక్షణను కొనసాగించాను. నా భర్త అంకుర్ బనా మొదట్లో అడ్డు చెప్పారు. కానీ నా సంకల్పాన్ని చూసి మద్దతు ఇచ్చారు.'అని పేర్కొంది. ప్రస్తుతం సోనికా యాదవ్ బరువు ఎత్తిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మహిళా శక్తి, దృఢ సంకల్పానికి ఆమె విజయం నిదర్శనమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఆల్ ఇండియా పోలీస్ వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26 టోర్నీకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆతిథ్యం ఇచ్చారు. వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్, యోగా ఈవెంట్లు అమరావతిలోని వీఐటీ క్యాంపస్, గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా ఈ టోర్నీ పోటీలు నిర్వహించారు.