ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11 తుది దశకు చేరుకుంది. ఒక్కో మ్యాచ్ ఫలితంతో ప్లే ఆఫ్స్ సమరం ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే హర్యానా స్టీలర్స్, దబాంగ్ ఢిల్లీ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. మరో రెండు స్థానాల కోసం యూపీ యోధాస్, పట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా, తెలుగు టైటాన్స్ పోటీ పడుతున్నాయి.
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 31-24తో టేబుల్ టాపర్ హర్యానా స్టీలర్స్‌ను ఓడించి తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపురుచుకుంది. 20 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 3 టైలతో మూడో స్థానంలో నిలిచిన యూపీ యోధాస్.. ప్లే ఆఫ్స్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది.

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో యూపీ తరఫున భవానీ రాజ్‌పుత్(11) సత్తాచాటాడు. ఫస్టాఫ్‌లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. హర్యానాను ఆలౌట్ చేసిన యూపీ యోధాస్ 15-13 తేడాతో ఆధిక్యం సాధించింది. సెకండాఫ్‌లో మరింత జోరు కనబర్చిన యూపీ యోధాస్.. మరోసారి హర్యానాను ఆలౌట్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. హర్యానా తరపున విశాల్, వినయ్ 6 పాయింట్స్‌తో రాణించారు.
యూపీ యోధాస్ విజయంతో తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. యూపీ యోధాస్ విజయంతో తెలుగు టైటాన్స్ 6వ స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. తెలుగు టైటాన్స్ 20 మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించింది. మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మూడింటికి మూడు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. నేడు తెలుగు టైటాన్స్ పట్నా పైరేట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
మంగళవారం జరిగిన మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 35-26 తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. ఈ గెలుపుతో జైపూర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా మెరుగయ్యాయి.