Pro Kabaddi League Season 10: ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10కు మరికొద్ది రోజుల్లో తెరలేవనుంది. డిసెంబర్ 2న తెలుగు టైటాన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ లీగ్ క్యాంపయిన్‌ను ప్రారంభించిన అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వినూత్న ప్రోమోలతో అభిమానులను అలరిస్తోంది.
ఆయా భాషల్లోని సూపర్ స్టార్లను ఈ సీజన్ ప్రచారకర్తలను నియమించుకున్న స్టార్ స్పోర్ట్స్.. కళ్లు చెదిరే వీడియో పాటలతో ఈ సీజన్‌పై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కబడ్డీ గురించి మాట్లాడిన వీడియోను అభిమానులతో పంచుకుంది.

ప్రో కబడ్డీ లీగ్ ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడిన రవి శాస్త్రి తాను కబడ్డీ ఆడిన రోజులను గుర్తు చేసుకున్నాడు. కబడ్డీ ఆడాలంటే దమ్ము ఉండాలని, ఛాలా ఫిట్‌గా ఉండాలని అభిప్రాయాపడ్డాడు. తన చిన్నప్పుడు ముంబై వీధుల్లో కబడ్డీ ఆడేవాళ్లమని, కాలనీల్లో ఉన్నవాళ్లంత తమ ఆటను ఆస్వాదించేవారని గుర్తు చేసుకున్నాడు. కబడ్డీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, న్యూజిలాండ్, పోలాండ్ దేశాల్లోని ప్రజలు కూడా ఈ ఆటను ఇష్టపడుతున్నారని తెలిపాడు.
'చిన్నప్పుడు మా కాలనీ వీధుల్లో కబడ్డీ ఆడేవాడిని. మా గేమ్ చాలా ఫన్‌గా ఉండేది. ఎందుకంటే సాయంత్రం వేళల్లో మేం కబడ్డీ ఆడే వాళ్లం. చుట్టూ ఉన్న వాళ్లంతా మా ఆటను ఆసక్తిగా చూసేవారు. దాదాపు 50 మంది వరకు మా ఆటను వీక్షించేవారు.
కబడ్డీ ఆడాలంటే చాలా ఫిట్‌గా ఉండాలి. ముఖ్యంగా లోయర్ బాడీ ధృడంగా ఉండటం కీలకం. విదేశాల్లో కూడా కబడ్డీకి ఆదరణ లభిస్తోంది. పొలాండ్, న్యూజిలాండ్ ప్రజలు కబడ్డీ ఆడటం నేను చూశాను.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.
ఇక సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ప్రో కబడ్డీ ఆడటం కంటే భీకరమైన పేస్ బౌలింగ్ ఎదుర్కోవడం సునాయసమని అభిప్రాయపడ్డాడు. 'నా చిన్నతనంలో ముంబైలో రాత్రి వేళల్లో కబడ్డీ మ్యాచ్‌లు నిర్వహించేవారు. చాలా ఉత్కంఠగా హోరాహోరీగా ఈ మ్యాచ్‌లు జరిగేవి. చాలా మంది ఈ మ్యాచ్‌లను ఆసక్తిగా చూసేవారు. నేను కూడా కబడ్డీ మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లేవాడిని. కబడ్డీ ఆడటం కంటే హెల్మెట్ ధరించి ఫాస్ట్ బౌలింగ్ ఆడటం ఈజీ. కబడ్డీ ఆడాలంటే.. బలం, తెలివితో పాటు శరీర ఫ్లెక్సిబిలిటీ అవసరం.'అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీ పడుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 వరకు సాగే ఈ టోర్నీలో మొత్తం 132 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 12 ఫ్రాంచైజీలకు చెందిన 12 నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్ని బృందాలు ఒక్కో నగరంలో తలో 6 రోజుల పాటు ఉంటాయి. మొదటి 6 రోజులు అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి.
ఆపై బెంగళూరు, పూణే, చెన్నై, నోయిడా, ముంబై, జైపూర్, హైదరాబాద్, పాట్నాలో పాటు ఢిల్లీ, కోల్‌కతా వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ మ్యాచ్‌ల అనంతరం ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని, షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు.