
బెంగళూరు: 20 నెలల సుదీర్ఘ విరామం అనంతరం మొదలైన ప్రొకబడ్డీ లీగ్ సీజన్ 8.. తొలి రోజే అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజాను అందించింది. క్రికెట్‌లో లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టి గెలిస్తే ఎంత మజా వస్తుందో అంతకు మించిన ఆనందం తెలుగు టైటాన్స్ అందించింది. తమిళ్ తలైవాస్‌తో బుధవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ఆద్యాంతం అద్భుత ప్రదర్శన కనబర్చి ఓడాల్సిన మ్యాచ్‌ను కాపాడుకుంది. ఆఖరి వరకు పట్టుదల కనబర్చి 40-40తో టైగా ముగించింది.
ఓ దశలో 9 పాయింట్ల తేడాతో ఓటమి అంచున చేరిన తెలుగు టైటాన్స్.. చివరి రెండు నిమిషాల్లో సిద్దార్థ్ దేశాయ్ సూపర్ రైడ్‌తో కమ్ బ్యాక్ చేసింది. వరుస పాయింట్లు సాధించి స్కోర్లను సమం చేసింది. ఆఖరి క్షణంలో సిద్దార్థ్ ఔటై.. కోర్టు వీడినా స్మార్ట్‌గా ఆడిన టైటాన్స్ ప్లేయర్ ఓటమిని తప్పించుకున్నారు. 39-40తో ఒక పాయింట్ వెనుకంజలో ఉన్న తెలుగు టైటాన్స్.. డూ ఆర్ డై వచ్చేలా చేసి పాయింట్ సాధించారు. దాంతో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. దాంతో ఇరు జట్ల ఖాతాలో చెరో మూడు పాయింట్లు చేరాయి. తెలుగు టైటాన్స్ తరఫున కెప్టెన్ సిద్దార్థ్ దేశాయ్ 11, రజనీష్ 6 పాయింట్లు సాధించగా.. తమిళ్ తలైవాస్ తరఫున మన్‌జీత్ 12, ప్రపంజన్ 6 పాయింట్లు నమోదు చేశారు.
గేమ్ ప్రారంభమైనప్పటీ నుంచే తమిళ తలైవాస్ దూకుడు కనబర్చింది. తొలి 10 నిమిషాల్లో తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేసి పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అనంతరం తెలుగు టైటాన్స్ నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంది. వరుస పాయింట్లతో తలైవాస్‌పై ఎదురుదాడికి దిగింది. ఆ జట్టును ఆలౌట్ చేసి స్కోర్లను కూడా సమం చేసింది. దాంతో ఫస్టాప్ 21-23 తేడాతో ముగిసింది. సెకండాఫ్ ఆరంభంలో కూడా తమిళ్ తలైవాసే పై చేయి సాధించింది. తెలుగు టైటాన్స్‌ను మరోసారి ఆలౌట్ చేసి 9 పాయింట్ల లీడ్ సాధించింది. అయితే చివరి నాలుగు నిమిషాల్లో తెలుగు టైటాన్స్ పుంజుకుంది. ముఖ్యంగా సిద్దార్థ్ దేశాయ్ సూపర్ రైడ్‌తో మూడు పాయింట్లు సాధించడంతో తెలుగు టైటాన్స్ రేసులోకి వచ్చింది. ఆ తర్వాత వరుసగా రెండు పాయింట్లు తెవడంతో స్కోర్లు సమమయ్యాయి. అయితే విజయం సాధిస్తుందనకునే క్రమంలో సిద్దార్థ్ ఔటయ్యాడు. దాంతో తమిళ్ తలైవాస్ ఒక పాయింట్ లీడ్ సాధించింది. అయితే స్మార్ట్‌గా ఆడిన తెలుగు టైటాన్స్.. డూర్ డై రైడ్‌లో ప్రత్యర్థి రైడర్‌ను ట్యాకిల్ చేసి మ్యాచ్‌ను టై చేసుకుంది.
అంతకు ముందు బెంగళూరు బుల్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో యూ ముంబా 46-30తో విజయం సాధించింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో యూ ముంబా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. యూ ముంబా తరఫున అభిషేక్ సింగ్ 19 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. బెంగళూరు బుల్స్‌లో పవన్ షెరావత్ 12 పాయింట్లతో పారాడినా ఫలితం లేకపోయింది.