Pro Kabaddi League సీజన్ 10లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. లీగ్‌లో 15వ పరాజయాన్ని నమోదు చేసింది. పట్నాలోని పటిల్‌పుత్రా ఇండో స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 29-60 తేడాతో పుణేరి పల్టాన్ చేతిలో చిత్తయ్యింది. పేలవ రైడింగ్, చెత్త డిఫెన్స్‌తో మూల్యం చెల్లించుకుంది.
పుణేరి పల్టాన్ తరఫున ఆకాశ్ షిండే(11), మహమ్మద్‌రేజా(7), మోహిత్ గయాత్(8), అస్లామ్ ముస్తాఫా సత్తా చాటారు. తెలుగు టైటాన్స్‌లో సంజీవి(8), మిల్ జబ్బారీ(5) మినహా అంతా విఫలమయ్యారు. కెప్టెన్ పవన్ షెహ్రావత్(4) సైతం దారుణంగా విఫలమయ్యాడు.

మ్యాచ్ ఆరంభం నుంచే జోరు కనబర్చిన పుణేరి పల్టాన్ సూపర్ రైడింగ్‌తో పాటు కళ్లు చెదిరే ట్యాక్లింగ్‌తో తెలుగు టైటాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ప్రతీ రైడర్‌ను పట్టేసిన పుణేరి డిఫెండర్స్.. తెలుగు టైటాన్స్‌ను రెండు సార్లు ఆలౌట్ చేశారు. దాంతో పస్టాఫ్ ముగిసే సరికి పుణేరి పల్టాన్ 29-6తో ఐదు రెట్ల ఆధిక్యంలో నిలిచింది.
సెకండాఫ్‌లో తెలుగు టైటాన్స్ కాస్త ప్రతిఘటించినా.. పుణేరి పల్టాన్ పట్టు వదల్లేదు. ధీటుగా పాయింట్స్ రాబట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో 50 సార్లు రైడింగ్ వెళ్లగా పుణేరి పల్టాన్ 21 సార్లు ఫలితం రాబట్టగా.. తెలుగు టైటాన్స్ 11 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యింది. ఇరు జట్లు చెరోసారి సూపర్ రైడ్ సాధించాయి.
ట్యాక్లింగ్‌లో పుణేరి పల్టాన్ 33 ప్రయత్నాల్లో 19 సార్లు సక్సెస్ అవ్వడంతో పాటు మూడు సార్లు సూపర్ ట్లాక్లింగ్ చేసింది. తెలుగు టైటాన్స్ 28 ప్రయత్నాల్లో 7 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యి ఒక్కసారి మాత్రం సూపర్ ట్యాక్లింగ్ చేసింది. ఇప్పటి వరకు 17 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 2 విజయాలు మాత్రమే నమోదు చేసి తెలుగు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
నేటి మ్యాచ్‌ల్లో పాట్నా పైరేట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్, జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తమిళ తలైవాస్ తలపడనున్నాయి. ఫిబ్రవరి 21 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనుండగా.. ప్రతీ జట్టు 22 మ్యాచ్‌లు ఆడనుంది.