ప్రొకబడ్డీ లీగ్ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపరకు ఎట్టకేలకు ముగింపు పలికింది. 11 పరాజయాల తర్వాత రెండో విజయాన్నందుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 49-32 తేడాతో యూపీ యోధాస్‌ను ఓడించింది. కెప్టెన్ పవన్ షెరావత్ రైడింగ్‌లో పంజా విసరగా.. ఓంకార్ పాటిల్(10) సూపర్ 10తో సత్తా చాటాడు. ఆల్‌రౌండర్ సంజీవి ఐదు పాయింట్లతో రాణించాడు.
యూపీ యోధాస్‌లో కెప్టెన్ ప్రదీప్ నర్వాల్(10), గగన గౌడ(7) రాణించారు. సొంత అభిమానుల మద్దతుతో దుమ్మురేపిన తెలుగు టైటాన్స్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చింది. సూపర్ రైడింగ్‌తో పాటు అదిరిపోయే డిఫెన్స్ పాయింట్లను రాబట్టింది. ఫస్టాఫ్ ముగిసే సరికి 24-16తో 8 పాయింట్ల ఆధిక్యం సాధించింది.

సెకండాఫ్‌లోనూ అదే జోరు కనబర్చిన తెలుగు టైటాన్స్.. ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసింది. రైడింగ్‌తో పాటు ట్యాక్లింగ్‌లో సత్తా చాటి 25 పాయింట్లను ఖాతాలో వేసుకొని భారీ విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 47 రైడ్స్‌లో 17 సార్లు సక్సెస్ అయ్యింది. నాలుగు సూపర్ రైడ్స్ చేసింది. యూపీ యోధాస్ 48 ప్రయత్నాల్లో 19 సార్లు మాత్రమే విజయవంతమైంది.
డిఫెన్స్‌లో తెలుగు టైటాన్స్ 27 ట్యాక్లింగ్ ప్రయత్నాల్లో 13 సార్లు సక్సెస్ అయ్యింది. యూపీ యోధాస్ 28 ప్రయత్నాల్లో 6 సార్లు మాత్రమే విజయవంతమైంది. ఒక్కసారి సూపర్ ట్యాకిల్ చేసింది.
తెలుగు టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ షెరావత్ 21 సార్లు రైడింగ్ వెళ్లి 12 సార్లు సక్సెస్ అయ్యాడు. నాలుగు సార్లు ఔటయ్యాడు. మరో ఐదు సార్లు పాయింట్లు లేకుండా తిరిగి వచ్చాడు. అతను సాధించిన 16 పాయిట్లలో 15 రైడింగ్ ద్వారానే రాగా.. ఒక్కటి ట్యాక్లింగ్ ద్వారా వచ్చింది. 15 రైడింగ్ పాయింట్స్‌లో 13 టచ్ పాయింట్స్.. 2 బోనస్‌గా వచ్చాయి.