PKL Season 10: ప్రొకబడ్డీ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ విజయాలతో దుమ్మురేపిన గుజరాత్ జెయింట్స్‌కు పాట్నా పైరేట్స్ టీమ్ షాకిచ్చింది. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్ 33-30 తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. ఆఖరి క్షణం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో కీలక సమయంలో పాట్నా పైరేట్ పై చేయి సాధించింది.
ఆరంభం నుంచి ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. ఫస్టాఫ్ ముగిసే సమయానికి 12-12తో సమంగా నిలిచాయి. సెకండాఫ్‌లో కూడా అదే ఆట తీరును ప్రదర్శించాయి. చివరి నిమిషంలో పాట్నా పైరేట్స్ ట్యాకిల్ పాయింట్స్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది.

పాట్నా పైరేట్స్‌లో సుధాకర్ 6 పాయింట్లతో సత్తా చాటగా.. సచిన్, నీరజ్ కుమార్, అంకిత్, సందీప్ కుమార్ తలో 4 పాయింట్లు సాధించారు. గుజరాత్ జెయింట్స్‌లో రాకేష్ ఒక్కడే 11 పాయింట్లు సాధించగా.. డిఫెండర్ సోంబిర్ 5 పాయింట్లతో సత్తా చాటాడు. చివరి నిమిషంలో గుజరాత్ జెయింట్స్ చేసిన తప్పిదాలు పాట్నా పైరేట్స్‌కు కలిసొచ్చాయి.
బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 28-28తో ఫలితం తేలకుండా ముగిసింది. ఆఖరి క్షణం వరకు హోరా హోరీగా తలపడటంతో టై అయ్యింది. ఫస్టాఫ్ ముగిసే సరికి 13-9తో లీడ్‌లో నిలిచిన జైపూర్ పింక్ పాంథర్స్.. సెకండాఫ్‌లో ఆ లీడ్‌ను కాపాడుకోలేకపోయింది. రైడింగ్‌తో పాటు డిఫెన్స్‌లో అదరగొట్టిన బెంగాల్ వారియర్స్ మ్యాచ్‌ను టై చేసుకుంది.

బెంగాల్ వారియర్స్ జట్టులో శ్రీకాంత్ జాధవ్ ఏడు పాయింట్లతో సత్తా చాటగా.. మణిందర్ సింగ్ 4 పాయింట్లతో రాణించాడు. జైపూర్‌లో భావాని రాజ్‌పుత్ 10, అర్జున్ దేశ్‌వాల్ 6 పాయింట్లతో రాణించారు. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ, పుణేరి పల్టాన్ వర్సెస్ యుముంబా తలపడనున్నాయి.