PKL Season 10: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. కోట్లు పెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేసినా.. సీజన్లు మారినా.. తెలుగు టైటాన్స్ రాత మాత్రం మారడం లేదు. ఎంతో ఆశతో చూస్తున్న తెలుగు రాష్ట్రాల అభిమానులను తెలుగు టైటాన్స్ తీవ్రంగా నిరాశపరుస్తోంది.
అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28-50 తేడాతో పాట్నా పైరేట్స్ చేతిలో చిత్తయ్యింది. 22 పాయింట్ల భారీ తేడా ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో ఇదే అత్యంత ఘోర పరాజయం. ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన పాట్నా పైరేట్స్.. ఫస్టాఫ్‌లోనే తెలుగు టైటాన్స్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసింది. దాంతో 28-16తో తొలి అర్థభాగాన్ని ముగించింది. 12 పాయింట్ల భారీ తేడాతో సెకండాఫ్ ప్రారంభించిన పాట్నా పైరేట్స్ అదే జోరును కొనసాగించింది. ఆధిక్యాన్ని డబుల్ చేసుకొని భారీ విజయాన్ని అందుకుంది. కళ్లు చెదిరే రైడింగ్‌తో పాటు సూపర్ ట్యాక్లింగ్‌తో తెలుగు టైటాన్స్‌ను మట్టికరిపించింది.
పాట్నా పైరేట్స్‌లో రైడర్ సచిన్ 14 పాయింట్లతో సత్తా చాటి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మనజ్‌త్ 8, నీరజ్ కుమార్ 4, సందీప్ కుమార్, అంకిత్ 5 సత్తా చాటారు.
తెలుగు టైటాన్స్ జట్టులో పవర్ షెర్వాత్ ఒక్కడే 11 రైడింగ్ పాయింట్స్‌తో రాణించగా.. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. డిఫెండర్ సందీప్ ధుల్ 4 ట్యాక్లింగ్ పాయింట్స్‌తో పర్వాలేదనిపించాడు.