
బెంగళూరు: ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8లో దబాంగ్ ఢిల్లీ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 52-35తో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన ఢిల్లీ.. ఘన విజయాన్నందుకొని పాయింట్స్ టేబుల్‌లో టాపర్‌గా నిలిచింది. ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ 24 రైడింగ్ పాయింట్లతో దుమ్మురేపగా.. ఆల్ రౌండర్ విజయ్ 10 పాయింట్లు సాధించాడు. బెంగాల్ వారియర్స్ తరఫున మనీందర్ సింగ్ 16, సుఖేశ్ హెగ్డే 9 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది.
గేమ్ ఆరంభంలోనే దూకుడు కనబర్చిన ఢిల్లీ.. బెంగాల్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసింది. నవీన్ కుమార్ సూపర్ రైడింగ్‌తో వరుస పాయింట్లు తేగా.. ఢిఫెండర్స్ సైతం రాణించారు. దాంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి ఢిల్లీ 33-15తో బెంగాల్‌పై డబుల్ లీడ్ సాధించింది. సెకండాఫ్‌లో బెంగాల్ కోలుకున్నా.. ఢిల్లీ తమ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్నందుకుంది. సెకండాఫ్‌లో ఇరు జట్లు చెరొకసారి ఆలౌటయ్యాయి. సెకండాఫ్‌లో ఢిల్లీ 14 రైడింగ్, 2 ట్యాకిల్, 2 ఆలౌట్, ఒక ఎక్స్‌ట్రా పాయింట్‌తొ 19 పాయింట్లే సాధించగా.. బెంగాల్ 16 రైడింగ్, 2 ట్యాకిల్, 2 ఆలౌట్ పాయింట్స్‌తో 20 పాయింట్లతో పై చేయి సాధించింది. కానీ ఫస్టాఫ్‌లో భారీ తేడా ఉండటంతో ఓటమికి తలవంచింది.
యూపీ యోధా, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. 32-32తో టై అయింది. యూపీ యోధా తరఫున ప్రదీప్ నర్వాల్ 11, సురేందర్ గిల్ 6 రైడింగ్ పాయింట్లు సాధించగా.. గుజరాత్ జెయింట్స్‌లో రాకేశ్ నర్వాల్ 14 రైడింగ్ పాయింట్లతో సత్తా చాటాడు. ఫస్టాఫ్ ముగిసే సమయానికి గుజరాత్ 20-14తో యూపీపై లీడ్ సాధించింది. కానీ సెకండాఫ్‌లో సత్తా చాటిన యూపీ యోదా ఏకంగా 18 పాయింట్లు సాధించి స్కోర్లు టై చేసింది. గురువారం జైపూర్ పింక్ పాంథర్స్X యు ముంబా(రాత్రి 7.30), హర్యానా స్టీలర్స్, బెంగళూరు బుల్స్( 8.30) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.