ప్రొకబడ్డీ లీగ్ సీజన్ 10లో బెంగళూరు బుల్స్ మరో విజయాన్ని అందుకుంది. ముంబైలోని ఎన్‌ఎస్‌సీఐ మైదానం వేదికగా సోమవారం జరిగిన తొలి పోరులో బెంగళూరు బుల్స్ 35-33 తేడాతో పాట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఆఖరి రైడ్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో బెంగళూరు బుల్స్ అసాధారణ ప్రదర్శనతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది.
ఇది బెంగళూరుకు ఐదో విజయం కాగా.. పాట్నా పైరేట్స్‌కు ఆరో ఓటమి. ఈ మ్యాచ్ ఫస్టాఫ్‌లో దారుణంగా విఫలమైన బెంగళూరు బుల్స్ 12-20 వెనుకపడింది. రైడింగ్, ట్యాక్లింగ్‌లో సమష్టిగా విఫలమై ఒకసారి ఆలౌటైంది. దాంతో తొలి అర్థ భాగం ముగిసే సరికి పాట్నా 8 పాయింట్ల ఆధిక్యం సాధించింది.

రెండో అర్థ భాగంలో జూలు విధిల్చిన బెంగళూరు బుల్స్ సూపర్ రైడ్స్‌తో పాట్నా పరేట్స్ పనిపట్టింది. డిఫెండర్స్ కూడా చెలరేగడంతో బెంగళూరు బుల్స్ పాయింట్ల వేటలో దూసుకెళ్లింది. సెకండాఫ్‌లో మొత్తం 23 పాయింట్స్ సాధించి విజయాన్ని అందుకుంది. 44 సార్లు రైడింగ్ వెళ్లిన బెంగళూరు బుల్స్ 13 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యింది.
పాట్నా పైరేట్స్ 43సార్లు రైడింగ్‌కు వెళ్లి 11 సార్లు మాత్రమే పాయింట్స్ తెచ్చింది. ట్యాక్లింగ్‌లో బెంగళూరు బుల్స్ 26 ప్రయత్నాల్లో 13 సార్లు సక్సెస్ అయ్యింది. మూడు సార్లు సూపర్ ట్యాకిల్స్ పాయింట్స్ సాధించింది. పాట్నా పరేట్స్ 26 ట్యాక్లింగ్ ప్రయత్నాల్లో 14 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యింది.
బెంగళూరు బుల్స్‌లో ఆల్‌రౌండర్ సచిన్ నర్వాల్ 9 పాయింట్స్ సాధించగా.. డిఫెండర్ సుర్జీత్ సింగ్ 8 పాయింట్స్ తీసుకొచ్చాడు. పాట్నా పైరేట్స్‌లో సచిన్ 6, నీరజ్ కుమార్ 5, మంజీత్ ఏడు పాయింట్స్ సాధించారు.