ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ ఘోర ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే చెత్తాటతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నతెలుగు టైటాన్స్.. టోర్నీలో 16వ పరాజయం నమోదు చేసింది. శనివారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 44-33 తేడాతో తెలుగు టైటాన్స్‌ను చిత్తు చేసింది.
దబాంగ్ ఢిల్లీ తరఫున ఆ జట్టు కెప్టెన్ అషు మాలిక్ 20 పాయింట్లతో సత్తా చాటగా.. ఆశిష్(6), మంజీత్(5) రాణించారు. తెలుగు టైటాన్స్‌లో పవన్ షెరావత్ 9 పాయింట్లు సాధించగా.. రాబిన్ చౌదరి 8 పాయింట్లతో రాణించినా ఫలితం లేకపోయింది.

ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఢిల్లీ దూకుడు కనబర్చింది. ఫస్టాఫ్‌లో రైడింగ్‌లో సత్తా చాటి తెలుగు టైటాన్స్‌ను ఒకసారి ఆలౌట్ చేసింది. దాంతో ఫస్టాఫ్ ముగిసేసరికి ఢిల్లీ 19-14తో లీడ్‌లో నిలిచింది.
సెకండాఫ్‌లోనూ అదే జోరు కొనసాగించిన దబాంగ్.. సూపర్ ట్యాక్లింగ్‌తో తెలుగు టైటాన్స్‌ను ఒకసారి ఆలౌట్ చేసింది. తెలుగు టైటాన్స్ పుంజుకునే ప్రయత్నం చేసినా ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు ఆధిపత్యం చెలాయించి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇరు జట్లు 48 సార్లు రైడింగ్ వెళ్లగా.. ఢిల్లీ 20, తెలుగు టైటాన్స్ 16 సార్లు సక్సెస్ అయ్యాయి. ఢిల్లీ ఓ సూపర్ రైడ్ కూడా చేసింది. ట్యాక్లింగ్‌లో 24 ప్రయత్నాల్లో ఢిల్లీ 13 సార్లు సక్సెస్ అవ్వగా.. తెలుగు టైటాన్స్ 32 ప్రయత్నాల్లో 12 సార్లు మాత్రమే పాయింట్స్ సాధించింది. చెరొకసారి సూపర్ ట్యాకిల్ చేశాయి.
మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 39-23తో యూ ముంబాను చిత్తు చేసింది. యూపీ యోధా కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో సత్తా చాటగా.. గగణ గౌడ(6), సుమిత్(7) పర్వాలేదనిపించారు. యు ముంబాలో శివమ్ ఒక్కడే ఐదు పాయింట్లతో రాణించాడు. జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టాన్, దంబాంగ్ ఢిల్లీ, హర్యాణా స్టీలర్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి.