ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్ 12 తుది దశకు చేరింది. రెండు నెలల పాటు కబడ్డీ అభిమానులను అలరించిన పీకేఎల్.. అసలు సిసలు సమరానికి రంగం సిద్దమైంది. హోరాహోరీ మ్యాచ్‌లు.. ఉత్కంఠ రేపిన సమరాలతో సాగిన లీగ్ దశ ముగియగా.. శనివారం నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 12 జట్టులో పోటీ పడగా.. టాప్-8లో నిలిచిన పుణేరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్, హర్యానా స్టీలర్స్, యూముంబా, పట్నా పైరేట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. గతం కంటే భిన్నంగా జరుగుతున్న ఈ సీజన్‌లో టాప్-4లో నిలిచిన జట్లు నేరుగా క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనుండగా.. తర్వాతి నాలుగు జట్లు ప్లే ఇన్ మ్యాచ్‌లు ఆడనున్నాయి.
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ మధ్య క్వాలిఫయర్-1 జరగనుండగా.. ఇందులో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దక్కుతుంది. ఐదు, 8వ స్థానం సాధించిన జట్ల మధ్య, 6వ, 7వ స్థానంలో నిలిచి నిలిచిన జట్ల మధ్య ప్లే ఇన్ మ్యాచ్‌లు ఆడిస్తారు.

ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు ఎలిమినేటర్-1 ఆడుతాయి. ఎలిమినేటర్ 1 విజేత ఎలిమినేటర్-2 అర్హత సాధిస్తాయి. 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు మినీ క్వాలిఫయర్‌లో ఆడుతాయి. విజేత ఎలిమినేటర్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ -2 ఆడుతుంది. ఎలిమినేటర్-2 విజేత ఎలిమినేటర్ 3కి వస్తుంది. ఎలిమినేటర్ 3 విజేత క్వాలిఫయర్-2 ఆడుతుంది. క్వాలిఫయర్-2 విజేత ఫైనల్‌కు చేరుతుంది.
నాలుగో స్థానంలో నిలిచి మినీ క్వాలిఫయర్ ఆడనున్న తెలుగు టైటాన్స్.. ఇందులో విజయం సాధిస్తే ఎలిమినేటర్-3కి అర్హత సాధిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలిమినేటర్-2 విజేతతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఇందులో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో ఆడుతుంది. ఇందులో విజయం సాధిస్తే ఫైనల్ చేరుతుంది. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన తెలుగు టైటాన్స్ 18 మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించింది.
మరో 4 మ్యాచ్‌లు వరుసగా గెలిస్తే టైటిల్ కైవసం చేసుకుంటుంది. అలా కాకుండా మినీ క్వాలిఫయర్‌లో ఓడి.. ఎలిమినేటర్ -1 విజేతతో ఎలిమినేటర్-2 ఆడుతుంది. ఇందులో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. గెలిస్తే మినీ క్వాలిఫయర్ విజేతతో ఎలిమినేటర్-3 ఆడుతోంది. ఓడితే ఇంటికి.. గెలిస్తే క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తోంది. ఇక్కడ గెలిస్తే ఫైనల్‌కు ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.