ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌కు రంగం సిద్దమైంది. ఆగస్ట్ 29న విశాఖపట్నం వేదికగా కబడ్డీ కూత మొదలవ్వనుంది. అయితే ఈసారి ప్రొ కబడ్డీ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులను మరింత అలరించేలా లీగ్ ఫార్మాట్‌లో నిర్వాహకులు మార్పులు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు, మార్చిన నిబంధనలను ప్రొకబడ్డీ శుక్రవారం వెల్లడించింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఇక నుంచి ప్రొకబడ్డీ లీగ్‌లో టై అనే మాటే వినబడదు. క్రికెట్‌లో సూపర్ ఓవర్ తరహాలో కబడ్డీలో గోల్డెన్ రైడ్ ద్వారా ఫలితం రాబట్టనున్నారు. గతంలోనూ ఈ రూల్‌ను ప్లే ఆఫ్స్ అమలు చేశారు. కానీ ఈ సారి లీగ్ దశ నుంచే గోల్డెన్ రైడ్ ద్వారా ఫలితం తేల్చనున్నారు.
మ్యాచ్ టై అయితే గోల్డెన్ రైడ్ రూల్ అమల్లోకి వస్తుంది. ఫలితం తేల్చేందుకు ప్రతీ జట్టుకు ఐదు రైడ్ అవకాశాలను ఇస్తారు. అత్యధిక పాయింట్స్ సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఐదు రైడ్స్ ముగిసినా స్కోర్లు సమమైతే మళ్లీ గోల్డెన్ రైడ్ రూల్ అమలు చేస్తారు. ఇందులో ఇరు జట్లకు చెరో రైడ్ ఇస్తారు. ఏ జట్టు అయితే ముందు పాయింట్ సాధిస్తుందో ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఒక జట్టు మొదటి రైడ్‌లో పాయింట్ సాధిస్తే, ఆ జట్టే విజేత అవుతుంది. రెండో జట్టుకు రైడ్ అవకాశం ఇవ్వరు. మొదటి రైడ్‌లో పాయింట్లు రాని పక్షంలోనే.. రెండో జట్టుకు రైడ్ అవకాశం వస్తుంది. ఈ రైడ్స్‌లో కూడా ఫలితం తేలకపోతే, విజేతను టాస్ ద్వారా నిర్ణయిస్తారు. మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు రెండు పాయింట్స్ లభిస్తాయి.

ఈ సారి ప్లే ఆఫ్స్ సమరం భిన్నంగా ఉండనుంది. గతంలో నాలుగు జట్లు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేవి. కానీ ఈసారి 8 జట్లు ప్లే ఆఫ్స్ చేరనున్నాయి. మొత్తం 12 జట్లతో లీగ్ దశ ముగిసిన తర్వాత టాప్-8లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా క్వాలిఫయర్-1 ఆడుతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం లభిస్తోంది.
ఐదు, 8వ స్థానం సాధించిన జట్ల మధ్య, 6వ, 7వ స్థానంలో నిలిచి నిలిచిన జట్ల మధ్య ప్లే ఇన్ మ్యాచ్‌లు ఆడిస్తారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు ఎలిమినేటర్-1 ఆడుతాయి. ఎలిమినేటర్ 1 విజేత ఎలిమినేటర్-2 అర్హత సాధిస్తాయి. 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు మినీ క్వాలిఫయర్‌లో ఆడుతాయి. విజేత ఎలిమినేటర్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ -2 ఆడుతుంది. ఎలిమినేటర్-2 విజేత ఎలిమినేటర్ 3కి వస్తుంది. ఎలిమినేటర్ 3 విజేత క్వాలిఫయర్-2 ఆడుతుంది. క్వాలిఫయర్-2 విజేత ఫైనల్‌కు చేరుతుంది.
విశాఖ పట్నం, జైపూర్, చెన్నై, ఢిల్లీ వేదికగా నాలుగు దశల్లో ఈ టోర్నీ జరగనుంది. లీగ్ దశలో మొత్తం 108 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతీ మ్యాచ్ 18 మ్యాచ్‌లు ఆడుతుంది.
ఈ సారి మొత్తం 12 జట్లు తలపడుతున్నాయి. హరియాణ స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్, పట్నా పైరేట్స్, యు ముంబ, జైపూర్ పింక్ పాంథర్స్, తెలుగు టైటాన్స్, పుణెరి పల్టాన్, తమిళ్ తలైవాస్, బెంగాల్ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్, బెంగళూరు బుల్స్.