టీమిండియా టీనేజ్ సెన్సేషన్, 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి మరో అరుదైన గౌరవం దక్కింది. వైజాగ్ వేదికగా శుక్రవారం మొదలవ్వనున్న ప్రొ కబడ్డీ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ ఆరంభ వేడుకలకు ఈ సిక్సర పిడుగు ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్‌తో కలిసి ఈ సీజన్‌ను వైభవ్ సూర్యవంశీ ప్రారంభించనున్నాడు. ఈ ఇద్దరితో పాటు హాకీ దిగ్గజం ధన్‌రాజ్ పిల్లయ్, ప్రదీప్ నర్వాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గతంలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లు ప్రొకబడ్డీ లీగ్‌ను ప్రారంభించగా.. ఆ అవకాశం కెరీర్ ఆరంభంలోనే సూర్యవంశీకి దగ్గడం గొప్ప విషయం.
జాతీయ క్రీడా దినోత్సవం(ఆగస్ట్ 29) నేపథ్యంలోనే నిర్వాహకులు లీగ్‌ను శుక్రవారం ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రొ కబడ్డీ లీగ్ ప్రతినిధి అనూపమ్ గోస్వామి తెలిపారు. ఆంధ్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఆరంభ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, తమిళ తలైవాస్ జట్లు తలపడనున్నాయి. రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, పుణెరి పల్టాన్ పోటీపడుతాయి.

ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కబడ్డీ మ్యాచ్‌లకు వైజాగ్ ఆతిథ్యం ఇస్తోంది. విశాఖలో సెప్టెంబర్ 11 వరకు తొలి దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 12 నుంచి 28 వరకు జైపుర్, సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 10 వరకు చెన్నైలో, అక్టోబర్ 11 నుంచి 23 వరకు ఢిల్లీలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను ఇంకా ఖరారు చేయలేదు.
ఈ సారి ప్రొకబడ్డీ కొత్త ఫార్మాట్‌లో జరగనుంది. లీగ్ దశలో మొత్తం 108 మ్యాచ్‌లు జరగనుండగా.. ప్రతీ టీమ్ 18 మ్యాచ్‌లు ఆడుతోంది. గెలిచిన జట్టుకు రెండు పాయింట్స్ రానుండగా.. ఓడిన జట్లకు ఎలాంటి పాయింట్స్ ఇవ్వరు. టై అయితే ఐదు రైడ్లతో షూటౌట్ నిర్వహిస్తారు. అప్పుడు కూడా పాయింట్స్ సమమైతే గోల్డెన్ రైడ్‌తో ఫలితాన్ని తేలుస్తారు. అప్పటికీ ఫలితం తేలకపోతే.. టాస్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. లీగ్ దశలో టాప్-8లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ ఆడతాయి.
ఈ సారి మొత్తం 12 జట్లు తలపడుతున్నాయి. హరియాణ స్టీలర్స్, దబంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్, పట్నా పైరేట్స్, యు ముంబ, జైపూర్ పింక్ పాంథర్స్, తెలుగు టైటాన్స్, పుణెరి పల్టాన్, తమిళ్ తలైవాస్, బెంగాల్ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్, బెంగళూరు బుల్స్.