Pro Kabaddi League:ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌ను తెలుగు టైటాన్స్ ఓటమితో ప్రారంభించింది. శనివారం జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32-38 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 34-31తో యూపీ యోధాస్‌పై విజయం సాధించింది.
ప్రొకబడ్డీ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర రూ.2.6 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న పవన్ సెహ్రావత్ రైడింగ్‌లో పది పాయింట్లతో మెరిసినా.. తెలుగు టైటాన్స్‌కు విజయం దక్కలేదు. మిగతా ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో పవన్ సెహ్రావత్ పోరాటం వృథా అయ్యింది. మ్యాచ్ ఆరంభంలో తెలుగు టైటాన్స్ దూకుడు ప్రదర్శించింది.

కెప్టెన్ పవన్ సెహ్రావత్ రైడింగ్‌లో సత్తా చాటడంతో పాయింట్ల వేటలో దూసుకెళ్లింది. ఫస్టాఫ్ ముగిసే సరికి 16-13తో ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకాండాఫ్‌లో తెలుగు టైటాన్స్ తడబడింది. సొంత అభిమానుల మధ్య గుజరాత్ జెయింట్స్ చెలరేగింది. సెకాండాఫ్‌లో తెలుగు టైటాన్స్ 16 పాయింట్లే సాధించగా.. బలంగా పుంజుకున్న గుజరాత్ జెయింట్స్ 25 పాయింట్లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
రెండు సార్లు ఆలౌటవ్వడం తెలుగు టైటాన్స్‌కు నష్టం చేసింది. సెకండాఫ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన గుజరాత్ జెయింట్స్ రైడర్ సోను.. 11 రైడింగ్ పాయింట్లతో తెలుగు టైటాన్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. గుజరాత్ జెయింట్స్ జట్టులో ట్యాక్లింగ్‌లో మహమ్మద్ నబిబక్ష్ 4 పాయింట్లతో రాణించాడు. పవన్ సెహ్రావత్ రాకతో ఎన్నో అంచనాలు పెట్టుకున్న తెలుగు అభిమానులు తెలుగు టైటాన్స్ ఓటమితో తీవ్ర నిరాశకు గురయ్యారు.
యు ముంబా బోణీ:
హోరాహోరీగా సాగిన రెండో మ్యాచ్‌లో యు ముంబా 34-31తో యూపీ యోధాస్‌ను చిత్తు చేసింది. యూపీ యోధాస్ జట్టులో సురేందర్ (7), అనిల్ కుమార్ (7) రైడింగ్‌లో సత్తా చాటారు. యు ముంబా తరపున అమీర్ మహమ్మద్ (12) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపాడు. ట్యాక్లింగ్‌లో ఆకట్టుకున్న రింకు (6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
నేటి మ్యాచ్‌లు:
ప్రొ కబడ్డీ సీజన్ 10లో భాగంగా నేడు(ఆదివారం) తమిళ్ తలైవాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి.