
బెంగళూరు: సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అత్యుత్సాహం ప్రదర్శించిన బెంగాల్ వారియర్స్ ఆటగాళ్లు చేజేతులా ఓటమి పాలయ్యారు. బెంగళూరు బుల్స్‌తో ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పాయింట్ తేడాతో విజయాన్ని చేజార్చుకున్నారు. ఆఖరి క్షణం వరకు పోరాడిన బెంగళూరు బుల్స్ 36-35తో బెంగాల్ వారియర్స్‌కు షాకిచ్చింది. చివరి నిమిషంలో రైడ్‌కు వెళ్లి సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ డోంగ్ జియోన్.. రెండు పాయింట్స్ తెచ్చి బెంగళూరు బుల్స్‌ను విజయాన్నిందించాడు. బెంగాల్ వారియర్స్ తరఫున కెప్టెన్ మనీందర్ సింగ్ 17 రైడింగ్ పాయింట్స్ సాధించినా ఫలితం లేకపోయింది. ఇక బెంగళూరు బుల్స్‌లో కెప్టెన్ పవన్ షెరావత్ 15 రైడింగ్ పాయింట్ల తేగా.. చందన్ రంజీత్ 6 రైటింగ్ పాయింట్లు తెచ్చాడు.
ఇక మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. దాంతో ఫస్టాఫ్ ముగిసే సరికి 18-17తో బెంగళూరు బుల్స్ లీడ్‌లో నిలిచింది. సెకండాఫ్‌లో చెలరేగిన బెంగాల్ వారియర్స్ వరుస పాయింట్లతో బెంగళూరు బుల్స్‌ను ఆలౌట్ చేసింది. అనంతరం బెంగళూరు బుల్స్ కూడా జోరు కనబర్చడంతో బెంగాల్ వారియర్స్ ఆలౌటైంది. దాంతో స్కోర్లు సమమయ్యాయి. మరో మూడు నిమిషాల్లో గేమ్ ముగుస్తుందనగా.. బెంగాల్ వారియర్స్ మూడు పాయింట్స్ లీడ్‌లో ఉంది. ఈ పరిస్థితుల్లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ డోంగ్ జియోన్ రెండు కీలక పాయింట్లు తెచ్చి గేమ్‌ను తమవైపు తిప్పాడు. చివర్లో స్మార్ట్‌గా ఆడిన బెంగళూరు బుల్స్ విజయాన్ని అందుకుంది.
ఇక అంతకుముందు గుజరాత్ జేయింట్స్, దబాంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ 24-24తో టైగా ముగిసింది. గుజరాత్ తరఫున రాకేశ్ నర్వాల్ 9 పాయింట్లు సాధించగా.. ఢిల్లీ తరఫున నవీకుమార్ 11 పాయింట్లు తెచ్చాడు.