ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12లో తెలుగు టైటాన్స్ పుంజుకుంది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జైపూర్‌లోని ఎస్‌ఎమ్‌ఎస్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 43-29 తేడాతో తమిళ్ తలైవాస్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఈ సీజన్ తొలి అంచెలో ఎదురైన పరాజయానికి తెలుగు టైటాన్స్ ప్రతీకారం తీర్చుకుంది.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన తెలుగు టైటాన్స్.. రైడింగ్, ట్యాక్లింగ్‌లో సమష్టిగా రాణించింది. కెప్టెన్ విజయ్ మాలిక్ సూపర్ 10 సాధించగా.. ఆల్‌రౌండర్ భరత్ హుడా 8 పాయింట్లతో సత్తా చాటి తెలుగు టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. డిఫెండర్ అంకిత్ కీలకమైన నాలుగు పాయింట్స్ రాబట్టాడు. తమిళ్ తలైవాస్‌లో కెప్టెన్ అర్జున్ దేశ్‌వాల్(7), నరేంద్ర కండోలా(6) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఫస్టాఫ్‌లోనే తమిళ్ తలైవాస్‌ను ఒకసారి ఆలౌట్ చేసిన తెలుగు టైటాన్స్ 22-11 తేడాతో భారీ ఆధిక్యంలో నిలిచింది. అయితే సెకండాఫ్‌లో తమిళ్ తలైవాస్ పుంజుకుంది. హోరాహోరీగా పాయింట్స్ రాబట్టింది. కానీ ఫస్టాఫ్ ఆధిక్యం చెక్కుచెదరకుండా కాపాడుకున్న తెలుగు టైటాన్స్.. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఆడి విజయాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు టైటాన్స్ 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తమ తదుపరి మ్యాచ్‌ను మంగళవారం(సెప్టెంబర్ 23) గుజరాత్ జెయింట్స్‌తో ఆడనుంది.
అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 34-30 తేడాతో పుణేరి పల్టాన్‌ను ఓడించింది. హర్యానా స్టీలర్స్ ఆల్‌రౌండర్ వినయ్ 13 పాయింట్స్‌తో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. శివమ్ పతారే 8 పాయింట్స్ రాబట్టాడు. పుణేరి పల్టాన్ తరఫున పంకజ్ మోహితే 14 పాయింట్స్‌తో రాణించినా ఫలితం లేకపోయింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లు ఆఖరి వరకు ప్రయత్నించాయి.
ఫస్టాఫ్‌లో హర్యానా ఆధిపత్యం చెలాయిస్తే.. సెకండాఫ్‌లో పుణేరి పల్టాన్ పుంజుకుంది. కానీ ఆధిక్యాన్ని కాపాడుకున్న హర్యానా విజయాన్ని కైవసం చేసుకుంది. ఫస్టాఫ్‌లో పుణేరి పల్టాన్‌ను ఆలౌట్ చేసిన హర్యానా 19-10తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో పుంజుకున్న పుణేరి పల్టాన్.. హర్యానాను ఒకసారి ఆలౌట్ చేసి రేసులోకి వచ్చింది. కానీ ఆధిక్యాన్ని కాపాడుకున్న హర్యానా విజయాన్ని కైవసం చేసుకుంది.