ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12లో యూపీ యోధాస్ జోరు కొనసాగుతోంది. ఆ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వైజాగ్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 34-31తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. గగమ్ గౌడ(7), అషు సింగ్(5), భవాని రాజ్‌పుత్(5), సుమిత్(5), శివమ్ చౌదరి(5) యూపీ యోధాస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. పట్నా పైరేట్స్ తరఫున మనిందర్ సింగ్(7) ఒంటరి పోరాటం చేశాడు.
ఆట ఆరంభంలో పట్నా ఆధిపత్యం చెలాయించింది. యూపీ పోటీ ఇచ్చినప్పటికీ వరుస పాయింట్లతో పట్నా ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఫస్టాఫ్ ముగిసే సమయానికి పట్నా 19-13తో లీడ్‌లో నిలిచింది. సెకండాఫ్‌లో దూకుడుగా ఆడిన యూపీ.. నెమ్మదిగా ప్రత్యర్థి ఆధిక్యాన్ని అధిగమించింది. ఆఖరి 10 నిమిషాల్లో వరుసగా పాయింట్స్ సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆ జట్టు విజయాన్నందుకుంది. మరోవైపు పట్నా కీలక సమయంలో తడబడి ఓటమికి తల వంచింది.

మరో మ్యాచ్‌లో పుణేరి పల్టాన్ 41-19 తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పుణేరి పల్టాన్ ముందు గుజరాత్ ఆటగాళ్లు తేలిపోయారు. ఆ జట్టుకు ఇది వరుసగా రెండో విజయం. అభినేష్ నదరాజన్(6), ఆదిత్య షిండే(6). అస్లామ్ ఇనామ్‌దార్(5) పుణేరి పల్టాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. గుజరాత్ జెయింట్స్‌లో రాకేష్(6) ఒక్కడే రాణించగా.. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు.
ఆరంభం నుంచే పుణేరి పల్టాన్ ఆధిపత్యం చెలాయించింది. ఫస్టాఫ్‌లోనే ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 17-11తో ఆధిక్యంలో నిలిచింది. ఫస్టాఫ్‌లో కాస్తో కూస్తో పోటీ ఇచ్చిన గుజరాత్ జెయింట్స్ సెకండాఫ్‌లో పూర్తిగా తేలిపోయింది. గుజరాత్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసిన పుణేరి పల్టాన్ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.
దబాంగ్ ఢిల్లీ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8 గంటలకు)
జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటలకు)