ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12లో పట్నా పైరేట్స్‌కు మరో ఓటమి ఎదురైంది. గురువారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా 40-39 తేడాతో పట్నా పరైట్స్‌ను ఓడించింది. సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను పట్నా పరైట్స్ చేజేతులా చేజార్చుకుంది.
ఆఖరి సెకండ్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ రైడర్ అయాన్ చేసిన తప్పిదం యు ముంబాకు కలిసొచ్చింది. స్కోర్లు 39-39 సమమైనప్పుడు ఆఖరి రైడ్‌కు వెళ్లిన అయాన్.. పాయింట్ తీసుకురావాల్సిన సమయంలో ఆరెంజ్ మ్యాట్ లైన్‌లోకి వెళ్లి సెల్ఫ్ ఔటయ్యాడు. దాంతో యుముంబా ఒక్క పాయింట్‌తో విజయం సాధించింది. అప్పటి వరకు 21 పాయింట్లతో సత్తా చాటిన అయాన్.. ఆఖరి రైడ్‌లో మాత్రం ఒత్తిడికి చిత్తయ్యాడు. డూ ఆర్ డై రైడ్ కావడం.. విన్నింగ్ పాయింట్ తీసుకురావాల్సి ఉండటంతో అయాన్ ఒత్తిడికి లోనై అదుపు తప్పాడు. ఇది యు ముంబాకు కలిసొచ్చింది.

ఆ జట్టులో అమిర్‌మోహమ్మద్(12), అనిల్(9) సత్తా చాటారు. పట్నా తరఫున అయాన్(21) ఒక్కడే పోరాడాడు. ఈ మ్యాచ్ ఆరంభంలో యు ముంబా ఆధిపత్యం చెలాయించింది. పట్నాను ఆలౌట్ చేసి ఫస్టాఫ్ ముగిసే సమయానికి 23-15తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో అయాన్ ప్రదర్శనతో పట్నా పుంజుకుంది. ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేయడంతో పాటు వరుస రైడ్ పాయింట్స్‌తో స్కోర్లను సమం చేసింది. కానీ ఆఖరి రైడ్‌లో అయాన్ చేసిన తప్పిదం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది.
రెండో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 38-28 తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. ఢిల్లీ తరఫున అషు మాలిక్(14) రాణించాడు. గుజరాత్ జెయింట్స్ రాకేష్(7), ప్రతీక్ దహియా(9) రాణించినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచి దబాంగ్ ఢిల్లీ ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి ఒకసారి ఆలౌట్ చేసి ఫస్టాఫ్ ముగిసే సమయానికి 21-14తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లోనూ అదే జోరును కొనసాగించి విజయాన్ని కైవసం చేసుకుంది.