ప్రొ కబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 12లో బెంగళూరు బుల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం వైజాగ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 40-33 తేడాతో హర్యానా స్టీలర్స్‌ను ఓడించింది. బెంగళూరు తరఫున ఆల్‌రౌండర్ అలిరేజా 12 పాయింట్స్‌తో సత్తా చాటగా.. కెప్టెన్ యోగేష్(6), డిఫెండర్ దీపక్ శంకర్, రైడర్ ఆశిష్ మాలిక్(5) కీలక పాయింట్లతో రాణించారు. హర్యానా స్టీలర్స్‌లో మయాంక్ సైనీ(6), శివమ్ పడేలా(7) రాణించినా ఫలితం లేకపోయింది.
మ్యాచ్ ఆరంభం నుంచే బెంగళూరు బుల్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి ఐదు నిమిషాల్లో హర్యానా స్టీలర్స్‌ను ఆలౌట్ చేసింది. ఆ తర్వాత హర్యానా పుంజుకొని బెంగళూరును ఆలౌట్ చేసింది. కానీ ఆధిక్యాన్ని అందుకున్న బెంగళూరు బుల్స్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి 21-18తో మూడు పాయింట్స్ ఆధిక్యంలో నిలిచింది. హర్యానా స్టార్ రైడర్ నవీన్ కుమార్ గాయంతో తప్పుకోవడం ఆ జట్టు కొంపముంచింది. సెకండాఫ్‌లోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే హర్యానాను ఒకసారి ఆలౌట్ చేసిన బెంగళూరు ఆధిక్యం సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది.
