ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11ను విజయంతో మొదలుపెట్టిన తెలుగు టైటాన్స్.. రెండో మ్యాచ్‌లోనే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 29-44 తేడాతో తమిళ్ తలైవాస్ చేతిలో చిత్తయ్యింది.
తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ సూపర్ 10 సాధించినా.. ఇతర ఆటగాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో తెలుగు టైటాన్స్‌కు ఘోర పరాజయం ఎదురైంది. మరోవైపు తమిళ్ తలైవాస్‌లో నరేందర్ కండోలా, సచిన్ సూపర్ 10 సాధించగా.. డిఫెండర్ సాహిల్ గులియా 5 పాయింట్స్ రాబట్టాడు.

మ్యాచ్ ఆరంభం నుంచే తెలుగు టైటాన్స్ తడబడింది. ఫస్టాఫ్ ఒకసారి ఆలౌటైన తెలుగు టైటాన్స్.. 17-20తో వెనుకంజలో నిలిచింది. రైడింగ్‌లో పర్వాలేదనిపించిన తెలుగు టైటాన్స్.. ట్యాక్లింగ్‌లో కాస్త వెనుకపడింది. దాంతో తమిళ్ తలైవాస్ పైచేయి సాధించింది.
సెకండాఫ్‌లో అనవసర ట్యాక్లింగ్‌తో తెలుగు టైటాన్స్ రెండు సార్లు ఆలౌటైంది. దాంతో తమిళ్ తలైవాస్ 24-12తో డబుల్ ఆధిక్యం సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ్ తలైవాస్ రైడింగ్‌తో పాటు ట్యాక్లింగ్‌లోనూ అదరగొట్టింది.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు మొత్తం 46 సార్లు రైడింగ్ వెళ్లాయి. తెలుగు టైటాన్స్ 16 సార్లు విజయవంతమవ్వగా... ఒక సూపర్ రైడ్ రాబట్టింది. మరోవైపు తమిళ్ తలైవాస్ 17 సార్లు సక్సెస్ అయ్యి.. ఒకసారి సూపర్ రైడ్ సాధించింది. ట్యాక్లింగ్‌లో మాత్రం తెలుగు టైటాన్స్ దారుణంగా విఫలమైంది.
27 ప్రయత్నాల్లో ఏడు సార్లు మాత్రమే సక్సెస్ అయ్యింది. తమిళ్ తలైవాస్ మాత్రం 30 ప్రయత్నాల్లో 16 సార్లు విజయవంతమైంది. తెలుగు టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్‌ను అక్టోబర్ 22న జైపూర్ పింక్ పాంథర్స్‌తో ఆడుతోంది.