ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11లో తెలుగు టైటాన్స్ అద్భుత విజయాన్నందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 31-32 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. ప్లే ఆఫ్స్ సమీపిస్తున్నవేళ తెలుగు టైటాన్స్ కీలక విజయాన్నందుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో వెనుకబడ్డ జట్టు.. బెంగాల్ వారియర్స్‌పై అద్భుత ప్రదర్శన చేసింది.
హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విజయ్ అసాధారణ ప్రదర్శనతో తెలుగు టైటాన్స్ గట్టెక్కింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నువ్వా-నేనా అన్నట్లు పాయింట్స్ రాబట్టాయి. ట్యాక్లింగ్‌తోనే పాయింట్ల ఖాతా తెరిచిన తెలుగు టైటాన్స్.. ఫస్టాఫ్ ముగిసే సమయానికి 16-15తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో కాస్త తడబడిన తెలుగు టైటాన్స్.. చివర్లో దుమ్మురేపింది. బెంగాల్‌ను ఆలౌట్ చేసి రేసులోకి వచ్చింది. చివర్లో బెంగాల్ 32-33తో టైటాన్స్‌ను ఓడించే ప్రయత్నం చేసింది. కానీ చివరి రైడ్‌లో కెప్టెన్ విజయ్ పాయింట్ సాధించి తెలుగు టైటాన్స్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

తెలుగు టైటాన్స్ విజయంలో కెప్టెన్ విజయ్ మలిక్(11), ఆశీష్(9) కీలక పాత్ర పోషించారు. మరోవైపు బెంగాల్ వారియర్స్‌లో మణిందర్ సింగ్(14), మంజీత్(7) రాణించినా ఫలితం లేకపోయింది. ఈ గెలుపుతో తెలుగు టైటాన్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు బెంగాల్ వారియర్స్ మాత్రం 10వ స్థానంలో నిలిచింది.
యూపీ యోధాస్ విజయం..
అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 36-33 తేడాతో పుణేరి పల్టాన్‌ను ఓడించింది. యోపీ యోధాస్ తరఫున గగన్ గౌడా(15), భావానీ రాజ్‌పుత్ సత్తా చాటారు. పుణేరీ పల్టాన్ తరఫున పంకజ్ మోహితే(11), మోహిత్ గోయత్ రాణించినా ఫలితం లేకపోయింది.
మ్యాచ్ ఆరంభం నుంచి యూపీ యోధాస్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. పుణేరి పల్టాన్‌ను ఆలౌట్ చేసి.. బ్రేక్ సమయానికి 21-11తో డబుల్ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. కానీ సెకండాఫ్‌లో పుణేరి పల్టాన్ సత్తా చాటింది. అద్భుతమైన రైడింగ్‌తో పాటు ట్యాక్లింగ్‌తో వరుస పాయింట్స్ సాధించింది.
అయితే యూపీ యోధాస్ ఆలౌట్‌ను గగన్ గౌడా పలుమార్లు అడ్డుకోవడంతో పాటు సూపర్ రైడ్ పాయింట్స్ సాధించాడు. ఇది పుణేరి పల్టాన్ విజయవకాశాలను దెబ్బతీసింది. స్కోర్లు సమం చేసే అవకాశం ఇవ్వకుండా చేసింది. చివర్లోనూ పుణేరి పల్టాన్ తప్పిదాలు యూపీయోధాస్‌కు కలిసొచ్చాయి.