ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్-11 తుది దశకు చేరింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో హరియాణా స్టీలర్స్, పట్నా పైరేట్స్ పోటీపడనున్నాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో హరియాణా 28-25 తేడాతో యూపీ యోధాస్‌ను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆరంభం నుంచి ఇరు జట్ల హోరా హోరీగా తలపడ్డాయి. ఒక్కో పాయింట్‌తో ముందుకు సాగాయి. అయితే విరామ సమయానికి హర్యానా స్టీలర్స్ 12-11తో ఆధిక్యంలో నిలిచింది.
సెకండాఫ్‌లో మరింత దూకుడుగా ఆడిన హర్యానా స్టీలర్స్ యూపీ యోధాస్ తప్పిదాలను క్యాష్ చేసుకుంది. ఒకసారి ఆలౌట్ చేసి ఆధిక్యంలో నిలవడంతో పాటు విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. హరియాణా తరఫున శివమ్ పటారే(7), వినయ్(5), రాహుల్(5) రాణించారు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ(10), భావాని రాజ్‌పుత్(5), హితేశ్(5) రాణించినా ఫలితం లేకపోయింది.

ఉత్కంఠ పోరులో పట్నా విజయం..
శుక్రవారమే జరిగిన రెండో సెమీఫైనల్లో పట్నా 32-28 తేడాతో దబాంగ్ ఢిల్లీని ఓడించింది. ఈ సీజన్‌లో వరుసగా 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఢిల్లీ కీలక పోరులో మాత్రం తడబడి ఓటమిపాలైంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన పట్నా పైరేట్స్ దబాంగ్ ఢిల్లీని ఆలౌట్ చేసి ఫస్టాప్ ముగిసే సరికి 17-10తో ఆధిక్యంలో నిలిచింది.
సెకండాఫ్‌లో పుంజుకున్న దంబాంగ్ ఢిల్లీ వరుస పాయింట్లతో జోరు కనబర్చింది. పట్నాను ఆలౌట్ చేసి స్కోర్లను సమం చేసింది. కానీ చివర్లో పట్నా కీలక పాయింట్స్ సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది. పట్నా తరఫున దేవాంక్(8), అయాన్(8), శుభమ్(5) రాణించారు. దబాంగ్ ఢిల్లీ తరఫున అషు మాలిక్(9), మోహిత్(7) రాణించినా ఫలితం లేకపోయింది.
ఫైనల్ ఎలా చూడాలంటే..
పుణె, బాలేవాడిలోని శ్రీ శివ్ చత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం జరిగే ఫైనల్లో పట్నా, హరియాణా అమీ తుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ కమ్ వెబ్‌సైట్ డీస్నా ప్లస్ హాట్ స్టార్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
హాట్ స్టార్‌లో కబడ్డీ మ్యాచ్‌లను ఫ్రీగా వీక్షించవచ్చు. స్టార్ స్పోర్ట్స్‌లో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.