ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో తమిళ్ తలైవాస్ అద్భుత విజయాన్నందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 40-26 తేడాతో యూపీ యోధాస్‌ను ఓడించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో ఓడిన తలైవాస్.. ఈ సారి మాత్రం అద్భుత ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా ఆ జట్టు సబిస్టిట్యూట్ ప్లేయర్ మసనముత్తు(6 పాయింట్లు) అద్భుత ప్రదర్శనతో విజయాన్నందించాడు.
మ్యాచ్ ఆరంభంలో యూపీ యోధాస్ దుమ్మురేపింది. తమిళ్ తలైవాస్‌ను ఆలౌట్ చేసి ఫస్టాఫ్ ముగిసే సరికి 17-12తో ఆధిక్యం నిలిచింది. దాంతో ఆ జట్టు విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ సెకండాఫ్‌లో వ్యూహం మార్చిన తమిళ తలైవాస్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా మసనముత్తును దింపింది. అతను 6 పాయింట్లతో తమిళతలైవాస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనితో పాటు డిఫెండర్ మోయిన్ షెఫగి(8 పాయింట్లు), నరేందర్ కండోల(6 పాయింట్లు) సత్తా చాటారు.

యూపీ యోధాస్ తరఫున గగన్ గోవాబ్(8), అషూ సింగ్(5) రాణించినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో యూపీ యోధాన్ 46సార్లు రైడింగ్‌కు వెళ్లి 11 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యింది. మరోవైపు తమిళ్ తలైవాస్ 47 సార్లు రైడింగ్‌కు వెళ్లి 17 సార్లు సక్సెస్ అయ్యింది. ట్యాక్లింగ్‌లోనూ తమిళ్ తలైవాస్ పై చేయి సాధించింది. 21 ప్రయత్నాల్లో 11 సార్లు సక్సెస్ అయ్యింది. యూపీ యోధాస్ మాత్రం 28 ప్రయత్నాల్లో 9 సార్లే ఫలితం రాబట్టింది. ఇందులో ఒక సూపర్ ట్యాకిల్ ఉంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన తమిళ తలైవాస్ 5 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో కొనసాగుతుండగా.. యూపీ యోధాస్ 6 విజయాలతో 8వ స్థానంలో నిలిచింది.
ఢిల్లీX పాట్నా టై..
దబాంగ్ ఢిల్లీ, పాట్నా పైరేట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39-39తో టైగా ముగిసింది. దబాంగ్ ఢిల్లీ తరఫున నవీన్ కుమార్(6), కెప్టెన్ అషు మాలిక్(11), ఆల్‌రౌండర్ ఆశిష్(7) సత్తా చాటారు. పాట్నా పైరేట్స్ తరఫున దేవాంక్ 15 పాయింట్లతో సంచలన ప్రదర్శన కనబర్చాడు. దీపక్(7), కెప్టెన్ అంకిత్(5) రాణించారు. 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 3 టైలతో దబాంగ్ ఢిల్లీ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, ఒక్క టైతో పాట్నా 6వ స్థానంలో నిలిచింది.