ప్రో కబడ్డీ సీజన్ 11లో హరియాణా స్టీలర్స్ జోరు కొనసాగుతోంది. ఆ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా 48-39తో యు ముంబాను ఓడించింది. హరియాణా రైడర్స్ విశాల్ టాటే, శివమ్ పతారే చెరో 11 పాయింట్లతో సత్తా చాటగా.. మోహమ్మడ్రేజా 10 పాయింట్లతో రాణించాడు. యుముంబా తరఫున అజిత్ చౌహన్ 18 పాయింట్లతో రాణించినా ఫలితం లేకపోయింది.
ఈ మ్యాచ్ అరంభం నుంచే ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఫస్టాఫ్ ముగిసే సమయానికి యు ముంబా 23-22 తేడాతో ఒక్క పాయింట్ ఆధిక్యాన్ని సాధించింది. ఫస్టాఫ్‌లో ఇరు జట్లు చెరొకసారి ఆలౌటయ్యాయి. విరామం తర్వాత హరియాణా జోరు పెంచింది. పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వరుస పాయింట్లతో దూసుకెళ్లింది. యుముంబాను ఒకసారి ఆలౌట్ చేయడంతో పాటు రైడింగ్, ట్యాక్లింగ్‌లో సత్తా చాటింది. ఎక్స్‌ట్రా పాయింట్స్ కూడా రాబట్టి విజయాన్ని అందుకుంది. మరోవైపు హరియాణా దూకుడుకు యూముంబా తేలిపోయింది. తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగింది.

ఈ మ్యాచ్‌లో హరియాణా మొత్తం 42 సార్లు రైడింగ్‌కు వెళ్లగా 24 సార్లు సక్సెస్ అయ్యింది. మరోవైపు యూ ముంబా 42 సార్లు రైడింగ్‌కు వెళ్లి 15 సార్లు మాత్రమే పాయింట్స్ రాబట్టింది. ఇందులో ఒక సూపర్ రైడ్ కూడా ఉంది. ట్యాక్లింగ్‌లో ఇరు జట్లు 31 ప్రయత్నాలు చేయగా.. హరియాణా 14 సార్లు ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టేసింది. యుముంబా మాత్రం 11 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యింది.
గుజరాత్ ఓటమి..
అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్ 40-27 తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్‌కు ఇది ఏడో పరాజయం. పట్నా పైరేట్స్ తరఫున ఆయన్ 10 పాయింట్స్‌తో సత్తా చాటాడు. గుజరాత్ తరఫఉన ప్రతీక్, గుమన్ ఐదేసి పాయింట్లతో రాణించారు.