ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పుణెరి పల్టాన్ జోరు కొనసాగుతోంది. ఐదో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 49-30 తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచే పునెరి పల్టాన్ దూకుడు కనబర్చింది.
ఫస్టాఫ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసి 30-9తో 21 పాయింట్ల ఆధిక్యం సాధించింది. సెకండాఫ్‌లో గుజరాత్ జెయింట్స్ పుంజుకున్నా.. పుణెరి పల్టాన్ పట్టు వదల్లేదు. ఆఖరి వరకు ఆధిక్యం కాపాడుకొని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పుణెరి పల్టార్ తరఫున ఆకాశ్ షిండే 11 పాయింట్స్ సాధించగా.. పంకజ్ మోహితే 8 పాయింట్స్ రాబట్టాడు.

గుజరాత్ జెయింట్స్ జట్టులో గుమన్ సింగ్ 12 పాయింట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. 7 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన పుణెరి పల్టాన్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
బెంగళూరుకు రెండో విజయం..
మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 36-32 తేడాతో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ అసాధారణ ప్రదర్శనతో విజయాన్నందుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి బెంగళూరు బుల్స్ 14-13తో ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచింది. తమిళ్ తలైవాస్ రైడింగ్‌లో తడబడటంతో బెంగళూరు పై చేయి సాధించింది.
సెకండాఫ్‌లోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే తమిళ్ తలైవాస్ ట్యాక్లింగ్‌లో చేసిన తప్పిదాలు బెంగళూరు విజయానికి కలిసొచ్చాయి. ఎలాంటి తప్పిదం చేయకుండా ఆఖరి వరకు ఓపికగా ఆడిన బెంగళూరు లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు తరఫున అజింక్యా పవర్ 6, సురిందర్ దెహాల్ 5, అక్షిత్ 6 పాయింట్స్‌తో రాణించారు. తమిళ్ తలైవాస్ తరఫున నరేందర్ కండోల 6 పాయింట్స్‌తో, సచిన్ 5 పాయింట్స్‌తో రాణించినా ఫలితం లేకపోయింది.